రుద్రంపూర్, ఆగస్టు 17 : ఎడమ చేయి, ఎడమ కాలు పక్షవాతంతో చచ్చుబడిపోయాయి. మరోవైపు మూత్రపిండాల సమస్యతో రెండు స్టంట్లు వేయించుకుని జీవితాంతం యూరినల్ బ్యాగ్‌తోనే జీవించాల్సిన దుస్థితి. కనీసం స్వయంగా మలమూత్ర విసర్జన చేసుకోలేని పరిస్థితిలో కుటుంబ సభ్యుల సహాయం తప్పనిసరి. ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉన్న కార్మికుడిని కూడా ‘ఫిట్ ఫర్ సర్ఫేస్ డ్యూటీ’ అంటూ విధులకు పంపడంపై సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్తగూడెం ఏరియా జీకే ఓసీలో జనరల్ మజ్దూర్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన రామ్ నివాస్ 2023లో తీవ్రమైన పక్షవాతానికి గురయ్యాడు. అనంతరం మూత్రపిండాల సమస్య తీవ్రం కావడంతో రెండు స్టంట్లు వేయించుకున్నాడు. వైద్యుల సూచనల మేరకు జీవితాంతం యూరినల్ బ్యాగ్‌తోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నవంబర్ 2025లో నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షల్లో ఆయనను ‘ఫిట్ ఫర్ సర్ఫేస్ డ్యూటీ’గా ప్రకటించి రుద్రంపూర్ డిస్పెన్సరీలో విధులు కేటాయించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జనవరి నుండి విధులకు హాజరవుతున్న ఆయన ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పక్షవాతం కారణంగా కదలికలు సరిగా లేకపోవడం, యూరినల్ బ్యాగ్‌తో ఉండటం, స్వయంగా మలమూత్ర విసర్జన చేసుకోలేని పరిస్థితి తనకు తీవ్ర వేదన కలిగిస్తోందని రామ్ నివాస్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. పనివేళల్లో అనుకోకుండా మలవిసర్జన వస్తే ఇంటి నుంచి కుటుంబ సభ్యులు వచ్చి తనను తీసుకెళ్లేంత వరకు నరకం అనుభవిస్తున్నట్లు వాపోయాడు. ఈ పరిస్థితిలో ఉద్యోగం చేయడం కంటే చావే మేలు అనిపిస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
రామ్ నివాస్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే రీ-మెడికల్ పరీక్ష నిర్వహించి, ఆయన వాస్తవ వైద్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యపరంగా విధులు నిర్వర్తించలేని స్థితి ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ చేపట్టి ఆయన కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు. సంస్థ కోసం సుదీర్ఘకాలం సేవలందించిన కార్మికుడి దయనీయ పరిస్థితిపై యాజమాన్యం మానవతా దృక్పథంతో స్పందించాలని, అర్హత ఉంటే నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుడికి కారుణ్య నియామకం కల్పించే అంశాన్ని పరిశీలించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుడి ఆరోగ్యం కంటే విధి నిర్వహణ ముఖ్యం కాదని, మానవత్వంతో వ్యవహరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.