మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా’ అన్న రీతిలో సీఎం సొంత నియోజకవర్గంలో సొమవారం అర్ధరాత్రి దౌర్జన్యకాండ సాగింది. ముఖ్యనేత సోదరుడి భూదాహం కోసం మద్దూరు మండల కేంద్రంలోని పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. బస్సు కాదుకదా కనీసం ఆటో కూడా తిరుగని ఆ రహదారిలో వెడల్పు పేరుతో పోలీసులను కాపలాపెట్టి నిర్మాణాలను కూలగొట్టిన వైనం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నది.
అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా హిటాచీలు, టిప్పర్ల శబ్దాలు, పోలీసుల సైరన్లు విని బయటకు వచ్చిన బాధిత కుటుంబాలను బయటకు ఈడ్చిపడేసి కనీసం ఇంట్లో సామాన్లనూ తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా వారిండ్లను నేలమట్టం చేశారు. ఈ దౌర్జన్యకాండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పినట్టు తెలుస్తున్నది. నారాయణపేట జిల్లా, సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోకి వచ్చే మద్దూరు మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పేదలను భయభ్రాంతులకు గురిచేసింది.

భారీ ఎత్తున పోలీస్ బలగాలు, హిటాచీలు, టిప్పర్లతో చేరుకొన్న మునిసిపల్ అధికారులు.. హనుమాన్ చౌరస్తా నుంచి చింతలదిన్నె వెళ్లే రహదారి వెడల్పు పేరుతో ఇండ్లు, దుకాణాలను కూల్చివేశారు. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోడ్డులో 50 అడుగుల వెడల్పు చాలని గతంలోనే మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ రోడ్డును 70 ఫీట్లకు పెంచి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ రోడ్డు కిరువైపులా భారీ ఎత్తున ఉన్న పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. మద్దూరు ఆంజనేయస్వామి చౌరస్తాలో మాత్రం 100 అడుగుల వరకు వెడల్పు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. దీంతో ఈ చౌరస్తాలో ఉన్న దుకాణాలన్నీ తొలగించాల్సి వస్తుంది.
ఆ తర్వాత 70 ఫీట్ల చొప్పున మున్సిపల్ ఆఫీస్ వరకు కూలగొట్టారు. ఆ తర్వాత దీన్ని 60 ఫీట్లకు కుదించి మద్దూరు శివారు వరకు రహదారిని నిర్మించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ ‘రోడ్డు వెడల్పునకు ఎవరు అడ్డు తగిలినా మరింత వెడల్పు చేస్తాం’ అని కొడంగల్ నియోజకవర్గంలో పాగా వేసిన ఓ ముఖ్య నేత వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతున్నది. ‘మీకు ఇందిరమ్మ ఇల్లు కాదు కదా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు.. అడ్డొస్తే పోలీసులు చూసుకుంటారు’ అని ఆ నేత హెచ్చరించడంతో బాధితులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆ 200 ఎకరాలపై ముఖ్యనేత సోదరుడి కన్ను
ముఖ్యనేత సోదరుడికి అదే మండల పరిధిలోని సాపన్‌చెరువు తండా సమీపంలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నుపడింది. కొంతమంది రెవెన్యూ అధికారులే మెప్పు కోసం ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆ ముఖ్యనేత సోదరుడి చెవిలో పడేశారని గుసగుసలు. ఇంకేముంది వెంటనే ఆ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించి లొకేషన్స్ స్కెచ్ తయారు చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలందాయి. ఆ భూమి మొత్తాన్ని సర్వే చేయించి, అసలు ప్రభుత్వ భూమి ఎంత ఉన్నదో తేల్చి, అప్పటికే పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న వారి వివరాలు తీసి సిద్ధంగా ఉంచాలని పురమాయించారు. ఆ మేరకు చకచకా పట్టాలు పొందిన వాళ్ల వివరాలను కూడా అతనికి చేరవేశారు.
ఆ భూమికి చేరుకోవాలంటే మండల కేంద్రం నుంచి చిన్నపాటి సందులతో ఉన్న రహదారి మీదుగా వెళ్లాలి. ఇంకేముంది రాజు తలుచుకుంటే.. అన్న చందాన రాత్రికి రాత్రి స్థానిక ప్రజలే కోరిన విధంగా మద్దూరు మండల కేంద్రంలోని ఆ రహదారిని ఏకంగా 60 ఫీట్ల వెడల్పు చేసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో మరో 5 ఫీట్లు వెడల్పు చేసి ఆ ప్రభుత్వ భూమికి రాచబాట వేసుకుంటున్నారు. తమ బినామీలకు కట్టబెట్టేందుకు.. ఈ 200 ఎకరాల భూమిపై స్కెచ్ తయారుచేశారు.
ప్రజలు వ్యతిరేకిస్తున్నా, అడ్డుపడుతున్నా, తమకు అవసరమే లేదని మొత్తుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ యంత్రాంగమంతా కదిలొచ్చి కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా వస్తున్న ఆదేశాలతో ఆగమేఘాల మీద పేదల ఇండ్లపై బుల్డోజర్లతో ప్రతాపం చూపించారు. మున్సిపల్ అధికారుల సాక్షిగా సాగిన ఈ బుల్డోజర్ల విధ్వంసపర్వంపై బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. 200 ఎకరాలను హస్తగతం చేసుకోవాలని భారీ కుట్ర నడుస్తున్నదని ప్రస్తుతం కొడంగల్ వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు
మద్దూరు చింతలదిన్నె రోడ్డులో ఉన్న మొత్తం 84 ఇండ్లను అధికార యంత్రాంగ నేలమట్టం చేసింది. ఆయా ఇండ్లలో అంతా పేదలే నివాసం ఉంటున్నారు. వారిలో 19 కుటుంబాలకు నిలువనీడ లేకుండా పోయింది. మట్టి మిద్దెలతో ఉన్న ఆ ఇండ్లను కనీసం చెప్పకుండా కూల్చివేయడంతో బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డుపాలయ్యాయి. నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డును వెడల్పు చేసి తమ భూదాహాన్ని తీర్చుకునేందుకు చేసిన బిగ్ బ్రదర్స్ ప్రయత్నం పై విమర్శలొస్తున్నాయి.
అర్ధరాత్రి పోలీసుల హల్చల్
మద్దూరు మండల కేంద్రంలో చింతల్‌దిన్నె రహదారి విస్తరణ పేరుతో సోమవారం ఉదయమే ఇండ్ల తొలగింపును చేపట్టినా ఎక్కడికక్కడే బాధితులు అడ్డుతగలడంతో ఉద్రిక్తత నెలకొన్నది. అయినా ప్రతి ఇంటి వద్ద ముగ్గురు, నలుగురు చొప్పున పోలీసులను పెట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో కొంతమంది వ్యతిరేకించారు. ఆ రహదారి లోపలికి ఎవరినీ రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
అప్పటికే ఇండ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. తిరిగి సోమవారం అర్ధరాత్రి దాటాక మంగళవారం తెల్లవారుజాము వరకు చింతల్‌దిన్నె రోడ్డుపై బుల్డోజర్లు గర్జించాయి. పేదల ఇండ్లను నేలమట్టం చేస్తూ ఆ శిథిలాలను వెనువెంటనే తొలగించేందుకు టిప్పర్లను కూడా రంగంలోకి దించారు. దీనికి పోలీసుల బందోబస్తు కొనసాగడంతో బాధిత కుటుంబాలు భయాందోళనకు గురయ్యారు. కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని స్టేషన్లను మార్చుతూ తిప్పారని తెలుస్తున్నది.