నగోయా: ఆసియా క్రీడల్లో నిలకడగా రాణిస్తున్న భారత్ ఆటల పదకొండో రోజు అదరగొట్టింది. టీమ్ ఈవెంట్స్‌లో మినహా వ్యక్తిగతంగా ఊరిస్తున్న బంగారు పతకంతో పాటు అథ్లెటిక్స్‌లో మహిళల రిలే జట్టు పసిడి పరుగు పెట్టడంతో ఒకేరోజు దేశానికి రెండు స్వర్ణాలు లభించాయి. ట్రాప్ షూటర్ నీరూ దండా రికార్డు గోల్డ్‌తో సత్తాచాటగా మహిళల 4X400 రిలేలో కిరణ్, పూవమ్మ, ప్రాచి, విథ్య బృందం దుమ్మురేపింది. మహిళల ట్రాప్ షూటింగ్లో నీరూ.. టీమ్ ఈవెంట్లో మనీషా, ఆషిమాతో కలిసి రజతం సాధించింది. అథ్లెటిక్స్‌లో గుల్వీర్ ‘హ్యాట్రిక్’ కొట్టగా హైజంపర్ పూజా సింగ్ కాంస్యం సొంతం చేసుకుంది. వీరితో పాటు 4X400 మెన్స్, 4X100 రిలే మిక్స్డ్ ఈవెంట్లలోనూ కంచు మోత మోగించిన భారత్.. పతకాల సంఖ్యను హాఫ్ సెంచరీ దాటించింది.

ఆరు రోజులుగా వివిధ క్రీడాంశాల్లో రజత, కాంస్య పతకాలు సాధిస్తున్నా పసిడి లేని లోటును చివరి రోజు మహిళల రిలే జట్టు తీర్చింది. ఆఖరి రోజు మహిళల 4X400 మీ. రిలే టీమ్‌లో కిరణ్, పూవమ్మ, ప్రాచి, విథ్యతో కూడిన బృందం.. 3 నిమిషాల 29.69 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. బహ్రెయిన్ (3:30.21) సిల్వర్ సాధించగా చైనా (3:31.02) కాంస్యం నెగ్గింది. చివరి రేసుకు ముందు భారత్ మూడో స్థానంలో ఉన్నా విథ్య.. చైనా రన్నర్ జు సియూతో పాటు బహ్రెయిన్ స్టార్ సల్వా నసెర్ను వెనక్కినెట్టి ప్రథమ స్థానాన నిలవడంలో కీలకపాత్ర పోషించింది.
వీరితో పాటు మిక్స్డ్ 4X100 మీటర్ల రిలే టీమ్‌లో గుర్విందర్ సింగ్, స్నేహా, అనిమేశ్, హరితతో కూడిన భారత్.. 41.06 సెకన్లతో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్ (40.87), చైనా (40.78) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించాయి. పురుషుల 4X400 మీటర్ల ఫైనల్లో విశాల్, మను, జై కుమార్, ధర్మవీర్ టీమ్.. 3 నిమిషాల 01.61 సెకన్లతో జపాన్, ఖతార్ తర్వాత మూడో స్థానంలో నిలిచి పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మహిళల హైజంప్‌లో పూజా సింగ్ 1.87 మీటర్ల ఎత్తుకు ఎగిరి బ్రాంజ్ గెలిచింది. హైజంప్‌లో 2002 తర్వాత ఈ క్రీడలో భారత్‌కు ఇదే మొదటి పతకం.

వాలీబాల్‌లో పురుషుల జట్టు క్వార్టర్స్ చేరింది. అత్యంత ఉత్కంఠగా సాగిన పూల్ దశ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 3-2తో ఖతార్‌పై గెలిచింది. రెండు గంటల 47 నిమిషాల పాటు సాగిన పోరులో రెండు సెట్లలో వెనుకబడ్డా తర్వాత పుంజుకున్న అబ్బాయిలు.. ప్రత్యర్థిని చిత్తుచేసి టోర్నీలో ముందంజ వేశారు. ఇక ఆర్చరీ విషయానికొస్తే రికర్వ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర, కృతి, కుంకుమ్ ముందంజ వేశారు. స్కాష్‌లో మహిళల జట్టు 3-0తో ఇరాన్‌పై గెలిచి క్వార్టర్స్ చేరింది. టెన్నిస్‌లో దక్షిణేశ్వర్, సుమిత్ నాగల్ తమ విభాగాల్లో తదుపరి రౌండ్లకు చేరారు.

గుల్వీర్ సింగ్ ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో హ్యాట్రిక్ కొట్టాడు. మంగళవారం అతడు పురుషుల 5 వేల మీటర్ల రేసులో 13 నిమిషాల 32.75 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి కాంస్యం సాధించాడు. ఈ మెగా టోర్నీలో అతడు ఇప్పటికే 1500 మీ., 10వేల మీ. ఈవెంట్స్‌లోనూ రజతాలు నెగ్గాడు. తద్వారా అతడు ఒకే ఎడిషన్‌లో మూడు పతకాలు గెలిచిన రెండో భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. ఆసియా గేమ్స్ ఆరంభ ఎడిషన్‌లో లావీ పింటో మూడు మెడల్స్ గెలిచాడు. మొత్తంగా చూస్తే గుల్వీర్ది మూడో స్థానం. ప్రస్తుత భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న పీటీ ఉష.. 1986లో సియోల్‌లో జరిగిన క్రీడల్లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

మంగళవారంతో ముగిసిన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఆరు రోజులుగా సాగిన పలు ఈవెంట్లలో ఒక స్వర్ణం, 9 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తంగా 24 పతకాలు గెలిచి ఓవరాల్‌గా ఆరో స్థానంతో ముగించారు. చైనా (39), జపాన్ (32), బహ్రెయిన్ (13) టాప్-3లో ఉన్నాయి. మొత్తంగా భారత్.. 52 మెడల్స్‌తో పతకాల పట్టికలో టాప్-10లోకి వచ్చింది.

బాక్సింగ్‌లో అంకుశ్ పంఘాల్, పర్వీన్ హుడా ఫైనల్ చేరారు. మెన్స్ 80 కిలోల విభాగంలో అంకుశ్.. 4-1తో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ ఎర్కిన్బొయెవ్ను ఓడించి పతకం రంగు మార్చుకున్నాడు. తద్వారా ఈ క్రీడల్లో ఎనిమిదేండ్ల విరామం తర్వాత ఫైనల్ చేరిన మొదటి పురుష (2018లో అమిత్ పంఘాల్ తర్వాత ఎవరూ ఫైనల్ చేరలేదు) బాక్సర్‌గా నిలిచాడు. మహిళల 65 కేజీల కేటగిరీలో పర్వీన్ 5-0తో లీ షు (చైనా)ను చిత్తుచేసి ఫైనల్ చేరింది. పురుషుల 90+కిలోల విభాగంలో నరేందర్ బెర్వాల్ సెమీస్‌లో 0-5తో ఐబెక్ (కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

పిస్టల్, రైఫిల్ షూటర్లపై లెక్కకుమించి అంచనాలు పెట్టుకున్నా వ్యక్తిగత విభాగాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పసిడి గురి పెట్టకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన భారత షూటింగ్ బృందంలో నీరూ చారిత్రాత్మక పతకంతో సత్తాచాటింది. మహిళల ట్రాప్ షూటింగ్లో 26 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి.. స్వర్ణానికి గురిపెట్టింది. ఏమాత్రం అనుకూలించని వాతావరణం, ఎడతెరిపి లేని వాన వంటి ప్రతికూల పరిస్థితులనూ తట్టుకుని ఏకాగ్రత కోల్పోకుండా లక్ష్యంపైనే గురిపెట్టిన నీరూ.. ఫైనల్లో 30 టార్గెట్లకు గాను 28 (ఆసియా క్రీడల రికార్డు.. గతంలో 24) లక్ష్యాలను ఛేదించి బంగారు పతకాన్ని ముద్దాడింది.
చైనా (26), కువైట్ (21) షూటర్లకు రజత, కాంస్యాలు దక్కాయి. కాగా, ట్రాప్ షూటింగ్లో 48 ఏండ్ల తర్వాత భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. 1978లో బ్యాంకాక్ ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో రణ్‌దీర్ సింగ్ గోల్డ్ గెలిచిన అనంతరం భారత్‌కు ఇదే మొదటి మెడల్ కాగా విమెన్ కేటగిరీలో నీరూదే తొలి పతకం. అదీగాక ఆసియా గేమ్స్ తాజా ఎడిషన్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు వచ్చిన మొదటి పసిడి పతకమూ ఇదే. ఇంతకుముందు క్రికెట్, కబడ్డీ, షూటింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు వచ్చాయి.

వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన నీరూ.. టీమ్ ఈవెంట్లో ఆషిమా, మనీషా కీర్తో కలిసి వెండి వెలుగులు పంచింది. ఫైనల్లో నీరూ (118), ఆషిమా (106), మనీషా (104) త్రయం 328 పాయింట్లు స్కోరు చేసింది. చైనా (346) పసిడి నెగ్గగా కువైట్ (325) కాంస్యం గెలుచుకుంది.
