వాషింగ్టన్: ఇరాన్‌తో వార్ ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూతో కలిసి ఆ అంశంలో పరస్పర నిర్ణయం తీసుకోనునట్లు ట్రంప్ వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఆపివేస్తూ ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను, నెతన్యహూ కలిసి ఉండకపోవతే, అప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ చేతిలో ఇజ్రాయెల్ నాశనం అయ్యి ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేయాలని ఇరాన్ చూసిందని, పక్క దేశాలను కూడా ధ్వంసం చేయాలని భావించిందని, అయితే నెతన్యహూ, తాను కలిసి పనిచేసినట్లు ట్రంప్ చెప్పారు.
ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని చూసిన దేశాన్ని తాము ధ్వంసం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై ఒంటరి నిర్ణయం తీసుకుంటారా లేక నెతన్యహూ కోసం ఎదురుచూస్తారా అని ట్రంప్‌ను అడగ్గా.. బహుశా అది పరస్పర అంగీకారంతో జరుగుతుందని ఆయన అన్నారు. మేం మాట్లాడుకుంటున్నామని, సరైన సమయంలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.