Asteroid : ఓ గ్రహశకలం అంతరిక్షంలో చంద్రుడివైపు దూసుకెళుతోందని, అది 2032లో చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న ఆ గ్రహశకలం ఢీకొడితే చంద్రుడి ఉపరితలంపై ఏకంగా 800 అడుగులమేర భారీ గుంత ఏర్పడుతుందని వారు వెల్లడించారు. దాని ప్రభావం భూమిపైనా పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ గుర్తించిన ఆ గ్రహశకలాన్ని ‘2024yr4’ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం స్వల్పంగా మాత్రమే ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘2024yr4’ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే భారీ విస్ఫోటనం ఏర్పడుతుందని, గ్రహశకలం ముక్కలైపోతుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ గ్రహశకలం ముక్కలు భూమివైపు వస్తాయని, వాటివల్ల భూకక్ష్యలో తిరగుతున్న ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
చంద్రుడిని ఢీకొట్టి ముక్కలైన గ్రహశకలంలో ఒక్కొక్క ముక్క ఒక్కో మీటర్ పరిమాణంలో ఉండే అవకాశం ఉందని, ఆ భారీ గ్రహశకలం ముక్కలు ఢీకొడితే భూకక్ష్యలోని ఉపగ్రహాలు దెబ్బతింటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం భూమి చుట్టూ సుమారు 10 వేలకు పైగా యాక్టివ్ ఉపగ్రహాలు తిరుగుతున్నాయని, మరో 25 వేల వరకు అంతరిక్ష వ్యర్థాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.