Yadadri | యాదగిరిగుట్ట: కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని మాసాపేట గ్రామానికి చెందిన యువరైతు ఎమ్మ శ్రీకాంత్ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతును పరామర్శించారు. ఇప్పటి వరకూ ఎంత పెట్టుబడి పెట్టావని రైతును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని రాబోయేది కేసీఆర్ పాలనేనని మీకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
శ్రీకాంత్ తన భార్య మెడలో నుంచి బంగారాన్ని కుదరబెట్టి వ్యవసాయం చేస్తే నాలుగు ఎకరాల భూమి పూర్తిగా ఎండిపోయింది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధతతో కాళేశ్వరం జలాలు సకాలంలో అందించక పోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం జలాలు విడుదల చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందన్న అక్కస్సుతో రేవంత్ రెడ్డి రైతులను అరిగోష పట్టిస్తున్నాడని మండిపడ్డారు. రైతాంగమంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారన్నారు. ఆయన పాలనలోననే వ్యవసాయం ఒక స్వర్ణ యుగంగా మారిందని రైతులే మాట్లాడుకుంటున్నారని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నీళ్లు తీసుకొచ్చామని నా పేరు నీళ్ల ఐలయ్య అని ప్రగల్బాలు పలుకుతున్నాడని మండిపడ్డాడు. నీళ్ల ఐలయ్య కాదని కరువు తెచ్చిన ఐలయ్య అని అన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం ఇవ్వాలన్నారు. త్వరలో ఎండిపోయిన పంటలపై రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరిగి రైతులకు అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మా నాయకులు హరీష్ రావు కేటీఆర్ సిద్ధమవుతున్నారని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలువలేదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, రైతుల పరుస్థితి బాగాలేదన్నారు. కేసీఆర్ పాలనలో పంటలు ఎండిపోయిన దాఖాలాలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు సరైన సమయంలో విడుదల చేస్తే ఈ దుస్థితి ఉండేది కాదు. లో ఓల్టేజీ కరెంట్ కారణంగా పంటలకు నీళ్లు పారడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీద రవీంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Also Read..
Nalgonda Police | కిడ్నాపర్ చెర నుంచి బాలునికి విముక్తి కలిగించిన పోలీసులు
Property Tax | ఆస్తి పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరేనా.. కరీంనగర్లో ఇప్పటివరకు వసూళ్లు 54 శాతమే
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ..