కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 7: ఓ వైపు ఆర్థిక సంవత్సరం ముగింపు వస్తున్న ఇంకా ఆస్తి పన్నుల (Property Tax ) వసూళ్లు లక్ష్యంగా భారీగానే మిగిలి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో 10కి పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే అత్యధికంగా వసూళ్లు చేయగా మిగిలిన మున్సిపాలిటీలు ఇప్పటి వరకు కేవలం 60 శాతం లోపే ఆస్తి పన్నులను వసూళ్లు చేశాయి. దీంతో ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగింపు అవుతుండడంతో ఈ మేరకు అనుకున్న లక్ష్యం మేరకు వసూళ్లు అవుతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి ఏటా కరీంనగర్ నగరపాలక సంస్థ సుమారుగా 95 శాతానికి పైగానే ఆస్తి పన్నులు వసూళ్లు చేస్తుంది. కాని ఈ సారి మాత్రం ఇప్పటి వరకు సుమారుగా 54 శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది. దీంతో మరో 24 రోజుల్లో ఏ మేరకు వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటుందన్న విషయంలో సందేహాలు వస్తున్నాయి. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు అత్యుహాత్సంతో చేపట్టిన బదిలీల వ్యవహరం కూడ వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో బిల్ కలెక్టర్ల వారిగా రోజువారి లక్ష్యాలను నిర్ణయించి వసూళ్లు చేసేవారు. దీంతో ఈ లక్ష్యాలను సాధించేందుకు బిల్ కలెక్టర్లు ఉదయం నుంచే బకాయిలు ఉన్న ఇంటికి వెళ్లి ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించే వారు. కాని ఇప్పుడు బిల్ కలెక్టర్ల వ్యవస్థను తీసివేసి ఉన్నతాధికారులు వార్డు ఆఫీసర్ వ్యవస్థ తీసుకువచ్చారు. కొత్తగా వచ్చిన వార్డు ఆఫీసర్లకు ఆయా డివిజన్లల్లో ఏ ఇళ్లు ఎక్కడ ఉందో తెలుసుకొవటానికి సమయం గడిపోతుంది. వీరికి ఎక్కడ పన్నులు వసూళ్లు చేయాలన్న విషయంలోనూ అవగహన లేకపోవటంతో పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. అలాగే వార్డు ఆఫీసర్లు అందరు కూడ ఉదయం 10 గంటలు అయితే కానీ వసూళ్లు కోసం రావటం లేదు. ఇంటి పన్నుల వసూళ్ల కోసం బకాయి ఇళ్ల వద్దకు వెళ్లే సరికి ఆయా ఇంటి యజమాన్యులు అప్పటికే తమ పనుల మీదపై బయటకు వెళ్లి పోతున్నారు. దీనికి తోడుగా అవగహన లేకపోవటంతో వసూళ్ల లక్ష్యం చేరేందుకు అడ్డుగా మారుతుంది. నగరపాలకలో చేపట్టిన బదిలీలను ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చేస్తే బాగుండేందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇలాంటి సమయంలో బదిలీలు చేయటం వల్లే పన్నుల వసూళ్లు భారీగా పడిపోవటానికి కారణం అన్న వాదనలు కూడ వినిపిస్తున్నాయి. సరియైన తీరులో ఉన్నతాధికారులు ఆలోచన చేయలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు కూడ తమ ఆస్తి పన్నుల వసూళ్లులో రాష్ట్రంలోనే టాప్లో కొనసాగుతుండగా…. మరి కొన్ని మున్సిపాలిటీలు పూర్ పనితీరును చూపిస్తున్నాయి. జురాబాద్ మున్సిపాలిటీ 92.45 శాతం వసూళ్లతో రాష్ట్రంలోనే మొదటగా ఉండగా…. జమ్మికుంట కూడ 91.72 శాతంతో రెండవ స్థానంలో ఉంది. తదనంతరం సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ 81.20 శాతంతో మూడోవ స్థానంలో కొనసాగుతుంది. జగిత్యాల జిల్లాకు సంబంధించి కొరుట్ల 76.38 శాతం, మెట్పల్లి 73.35 శాతం, రాయికల్ 69.17 శాతం, ధర్మపురి 53.33 శాతంతో, జగిత్యాల 49.93 శాతంతో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ 66.30 శాతంతో, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి 65.08 శాతంతో, మంథని 64.94 శాతంతో, రామగుండం నగరపాలక సంస్థ 55.95 శాతంతో, సుల్తానాబాద్ 36.91 శాతం మేరకు వసూళ్లు చేశాయి. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థ 54.40 శాతంతో, చొప్పదండి 54.22 శాతం వసూళ్లు చేశాయి.