Haritha Haram Trees | రాయపోల్, మే 11: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన చెట్లను ఓ షాపు యజమాని ఎదగనీయకుండా నరికివేస్తున్నాడు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానిక వాసుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాతాజీ కిరాణ జనరల్ స్టోర్ షాపు ముందు నాటిన చెట్లు పెరగకుండా తరచూ కొమ్మలను కత్తిరిస్తూ.. చెట్ల పెరుగుదలను అడ్డుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యాలను విస్మరిస్తూ ఇలాంటి చర్యలు కొనసాగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్లు పూర్తిగా ఎదగకముందే నరికివేయడంతో వాటి అభివృద్ధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, చెట్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
హరితహారం చెట్లను నాశనం చేసే వారిపై గ్రామ పంచాయితీ అధికారులు, సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.