Kalki 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, వైవిధ్యభరిత దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన కల్కి 2898 AD భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరోస్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు రెండో భాగంతో మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.మొదటి భాగం ముగింపులో వచ్చిన ట్విస్టులు, ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్స్, కమల్ హాసన్ ఎంట్రీ ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తించాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ‘కల్కి 2’పైనే ఉంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్ నాటికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయిలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ పనుల కోసం ఎక్కువ సమయం అవసరమవుతుండటంతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించిన సుమారు 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ప్రారంభంలో ‘కల్కి 2’ కీలక షెడ్యూల్స్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
మేకర్స్ ప్రణాళిక ప్రకారం 2027 ఏప్రిల్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాతి నెలలను పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సీక్వెల్లో ప్రభాస్ పోషిస్తున్న భైరవ, కర్ణ పాత్రలకు మరింత ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్య జరిగే పవర్ఫుల్ పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం కేవలం కథకు పరిచయం మాత్రమేనని, అసలు యుద్ధం రెండో భాగంలోనే ప్రారంభమవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో ‘కల్కి 2’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లే జరిగితే 2027 డిసెంబర్లో ‘కల్కి 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.