CJP Protest : తమ అన్ని డిమాండ్లను కేంద్రం నెరవేర్చినందుకు ఆందోళన విరమిస్తున్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం దీనిపై ప్రకటన చేసింది. నిరసనకారులు, మద్దతుదారులు అంతా శాంతియుతంగా దీక్ష విరమించి, తమ ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని సూచించింది. కేంద్రంతో శనివారం సీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం సీజేపీ ఈ ప్రకటన చేసింది.
కేంద్ర మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా తదితరులు శనివారం చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం అశుతోష్ రాంకా, కేంద్ర మంత్రులు మీడియాకు వివరాలు వెల్లడించారు. కేంద్రంతో అన్ని డిమాండ్లు నెరవేరాయి. అందువల్ల నిరసనకారులు శాంతియుతంగా తమ ఆందోళన విరమించాలి. వెంటనే దీక్ష విరమించి, అందరూ ఇంటికి బయల్దేరాలి. మా భవిష్యత్ వ్యూహాల గురించి, ఇతర సమస్యలపై స్పందన గురించి మేం మళ్లీ తెలియజేస్తాం. కానీ, నిరసనకారులు వెంటనే తమ దీక్ష విరమించాలి అని కోరారు. ఈ సందర్భంగా తాము కేంద్రంతో మూడు దఫాలు చర్చలు జరిపినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు. మొదటిది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. రెండోది నిరసనకారులపై మోపిన కేసులు, ఎఫ్ఐఆర్లు రద్దు చేయడం. మూడోది నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించడం. ఈ మూడు డిమాండ్లు నెరవేరిన కారణంగా తమ ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది.