Priyanka Chopra | గ్లోబల్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రియాంక చోప్రా సినీ ప్రయాణం ఏ హీరోతో మొదలైందో తెలుసా?. అతను మరెవరో కాదు తమిళ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కావడం విశేషం. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, ఆయన గురించి గతంలో ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. 2002లో విడుదలైన తమిజన్ సినిమాతో ప్రియాంక చోప్రా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించగా, ప్రియాంక హీరోయిన్గా కనిపించారు. అప్పట్లో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియాంకకు తమిళ భాష కూడా తెలియదట.
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు అప్పట్లో తమిళం అస్సలు రాదు. డైలాగులను కాగితంపై రాసుకుని బట్టీ పట్టి చెప్పేదాన్ని. సినిమాల షూటింగ్ ఎలా జరుగుతుంది? సెట్స్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే విషయాలపై కూడా పెద్దగా అవగాహన లేదు. థియేటర్లో సినిమాలు చూడడమే నాకు తెలిసిన అనుభవం అంటూ గుర్తుచేసుకున్నారు. అయితే ‘తమిళన్’ షూటింగ్ సమయంలో విజయ్‌కు ఉన్న అభిమాన గణాన్ని చూసి తాను పూర్తిగా ఆశ్చర్యపోయానని ప్రియాంక తెలిపారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వందలాది అభిమానులు వచ్చేవారని, సెట్స్‌లోకి రావడానికి కూడా పోటీ పడేవారని చెప్పారు.
విజయ్ డ్యాన్స్ చేస్తున్నా, డైలాగులు చెబుతున్నా అభిమానులు ఆయననే చూస్తూ ఉండేవారు. ఆ క్రేజ్ చూసి నేను షాక్ అయ్యాను. ప్రజలు విజయ్ను దేవుడిలా ఆరాధిస్తున్నారనే భావన నాకు కలిగింది అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కూడా గతంలో విజయ్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. షూటింగ్ సమయంలో విజయ్ ప్రియాంకను ఎంతో గౌరవంగా చూసుకునేవారని, కొత్త హీరోయిన్ అయినప్పటికీ ఎంతో సహకరించారని తెలిపారు. మొదట్లో విజయ్‌తో సమానంగా డ్యాన్స్ చేయడం ప్రియాంకకు కాస్త కష్టంగా అనిపించిందని, కానీ ఆమె కఠిన సాధనతో తన ప్రతిభను నిరూపించుకుందని చెప్పారు. అలాగే ‘తమిళన్’ సినిమా అనుభవమే ప్రియాంకను నటనను పూర్తి స్థాయి కెరీర్‌గా ఎంచుకునేలా ప్రేరేపించిందని వెల్లడించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘తమిళన్’ సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రియాంక చోప్రాకే కాకుండా దర్శకుడు మజీత్కు కూడా తొలి చిత్రం కావడం విశేషం.