Roads | రాయపోల్, ఎప్రిల్ 29 : గుంతల దారితో వాహనదారులు ప్రతి రోజు పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో ఈ రోడ్డు పంచాయతీరాజ్ పరిధిలో ఉండేది. కానీ ప్రస్తుతం ఆర్అండ్బీ శాఖలో ఉంది. దౌల్తాబాద్ మండలం హైమద్ నగర్ నుంచి రాయపోల్ మండలం వయా రామారం, వడ్డేపల్లి, బేగంపేట మిధుగా నాచారం వరకు రోడ్డు మరమ్మతుల పనులు చేపడుతామని గతంలో అధికారులు, నాయకులు హామీలు ఇచ్చినా నేటికి కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఈ రోడ్డుపై వెళ్లలంటే వాహనదారులు జంకుతున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
వడ్డేపల్లి, బేగంపేట నాచారం వరకు రోడ్డుపై అడ్డుగడుగునా గుంతలు ఉండడంతో వాహనదారులకు, ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. అధ్వాన్నంగా ఉన్న రోడ్డు డబుల్ విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మండలంలో రోడ్ల పరిస్థితులు మారడం లేదని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైమద్ నగర్ నుంచి తిర్మలాపూర్, రామారం, గుర్రల సోఫ నుంచి వడ్డేపల్లి బేగంపేట నాచారం వరకు గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేయాలని గతంలో పలు గ్రామాల ప్రజలు గుర్రాల సోఫా వద్ద రోడ్డుపై ఆందోళన చేశారు.
ఆయా గ్రామాల ప్రజలు, యువకులు, విద్యార్థులు గతంలో అన్ని పార్టీల నాయకులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై మూలమలుపులు కూడా ఉండడంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతుల పనులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఆర్అండ్బీ అధికారులు తగిన శ్రద్ద వహించి వాహనదారుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని గుంతాల మయంగా ఉన్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
