పాట్నా, ఆగస్టు 14 : ఒక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులపై మూకలు దాడి చేసిన ఘటన బీహార్లోని వైశాలి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. నేరస్థుడిని అరెస్టు చేసిన కొద్దిసేపటికే 200 మందితో కూడిన గుంపు రాళ్లతో పోలీసు బృందంపై దాడి చేసి అతడు తప్పించుకోవడంలో సాయపడిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అనేక కేసుల్లో నిందితుడైన ఒక వ్యక్తి మహ్నార్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసు బృందం అక్కడకు వెళ్లి అరెస్టు చేసింది. కొద్ది సేపటికే 200 మందితో కూడిన గుంపు అక్కడకు చేరుకుని పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఆ గందరగోళం మధ్య నిందితుడు పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని ఘటనపై కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.