సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట రూ.లక్షల ఫీజులను వసూలు చేసింది. ఫీజలు కట్టిన ఏడాది తర్వాత ప్రోసిడింగ్ పత్రాలిచ్చింది. ఏళ్లకేండ్లు ఎదురుచూపుల తర్వాత తమ ప్లాట్లు రెగ్యులరైజ్ చేసిందనే ఊరట లేకుండా అవే ప్లాట్లను 22ఏలో చేర్చింది. మరీ ఇన్నాళ్లు ఎల్ఆర్ఎస్ పేరిట వసూలు చేసిన ఫీజులు, ఇచ్చిన ప్రోసిడింగ్స్ మరిచిన కాంగ్రెస్ చివరకు చిత్తు కాగితంలాగా ల్యాండ్ రెగ్యులరైజ్ పథకాన్ని మార్చివేసింది.
అనధికారిక లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టింది. కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ స్కీం… గ్రామ పంచాయతీ ఇచ్చిన ప్లాట్లు, కట్టుకున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసింది. అప్పటి నుంచి అవే నిబంధనలు అమలులో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు పర్యాయాలు ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు… హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లోని వేలాది ప్లాట్ల పేరిట వందల కోట్లు వసూలు చేసింది.
ఇందులో ఇప్పటికీ కొన్ని ఫైనల్ ప్రోసిడింగ్స్ కోసం ఎదురుచూస్తుండగా… మరికొన్ని పలు దశల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ఫీజలు కట్టి, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్లాట్లను క్రమబద్ధీకరించిన సర్కారు… ఇప్పుడు అవే ప్లాట్లను 22ఏలో చేర్చింది. ఆరు నెలలుగా ఫీజులు కట్టిన ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన సర్కారు… ఇప్పుడు అవే ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తామని మార్గదర్శకాలు జారీ చేస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు 22ఏ పేరిట చేసిన విధ్వంసంతో ఇప్పటికీ జనాలు కోలుకోలేకపోతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన సర్కారు… క్రమబద్ధీకరణ పేరిట మరో నాటకానికి తెరలేపింది. జీవో నం.118లో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇవ్వగా… ఇందులో గతంలో ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టిన ప్లాట్లు కూడా ఉన్నాయి. వీటిని కూడా ఇప్పుడు మరోసారి క్రమబద్ధీకరిస్తామని చెప్పడంపై రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లకే ఎసరు పెట్టినట్లు అవుతుందనీ, మరోసారి భూ యజమానులు ప్రభుత్వం చెప్పే ఫీజులు చెల్లించాల్సిందేనని వాపోతున్నారు. గతంలో జీవోనం.118 కింద రెగ్యులరైజ్ చేసుకోవడానికి కనీస ఫీజుగా గజానికి రూ.250 వసూలు చెల్లించాలని ఉంది. అయితే ఎప్పుడో ఎల్ఆర్ఎస్ కట్టుకున్న ప్లాట్లను కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేందుకు మార్గదర్శకాలు జారీ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.