‘దాదాపుగా 20ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేశాను. తను రచన చేసిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు క్లాసిక్ లవ్స్టోరీలుగా నిలిచాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నాకోసం అద్భుతమైన కథను తెచ్చారు త్రివిక్రమ్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఊహించని ట్విస్టులుంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ‘ఆదర్శకుటుంబ’ మామూలు కుటుంబం కాదు. ఇది వేరే లెవెల్. త్రివిక్రమ్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. మీరు కచ్ఛితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ నమ్మకం వెలిబుచ్చారు.
ఆయన హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదర్శకుటుంబం: హౌస్ నెం 47 – AK 47’. శ్రీనిధిశెట్టి కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈసినిమాలోని తొలి పాట ‘నారాయణమ్మ..’ను మేకర్స్ విడుదల చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘వెంకటేశ్‌గారి ‘పవిత్రబంధం’ సినిమాతో నా సినీప్రయాణం మొదలైంది.
‘నువ్వునాకు నచ్చావ్’తో మా బంధం బలపడింది. అందుకే ఆయనకు నేనెప్పుడూ కృతజ్ఞుడినై ఉంటా. ఈ పాట రామజోగయ్య అద్భుతంగా రాస్తే, అంతే అద్భుతంగా తమన్ స్వరపరిచారు. వెంకటేశ్గారితోపాటు శ్రీనిధిశెట్టి, డింపుల్ హయాతి, నివేద పేతురాజ్ పాటకు అందాన్ని తెచ్చారు. సినిమా కలర్ఫుల్గా ఉంటుంది’ అని తెలిపారు. ఇంకా తమన్, శ్రీనిధిశెట్టి, డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్, రామజోగయ్యశాస్త్రి కూడా మాట్లాడారు.