హైదరాబాద్,సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): త్వరలో ఖాళీ కానున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు నిరూపించుకోవాలని చూ స్తున్న బీజేపీకి సొంత ఎన్డీయే కూటమి నుంచే ఊహించని షాక్ తగిలింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ముందస్తుగానే ప్రకటించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదంతోనే ఈ ప్రకటన వెలువడినట్టు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశా యి.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి పోటీచేసేందుకు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి లాంటి బీజేపీ సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఇటీవల అదరాబాదరగా సమావేశమయ్యారు. జనసేనతో పొత్తులేకుండా ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. జనసేనతో సమన్వయం కుదరకపోతే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనూ కమలానికి ఎదురుదెబ్బ తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పేరు ఖరారైనట్టు సమాచారం.