గాలె: దేశ ప్రజలంతా 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో ఉండగా.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు
చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనున్నది. తమ టెస్టు ప్రస్థానంలో 600వ మ్యాచ్‌లో భాగంగా గాలె గడ్డపై శ్రీలంకతో తలపడనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ చరిత్రకెక్కనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం మొదలయ్యే ఈ పోరుతో 50 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ఆసియా తొలి మైదానంగా గాలె నిలవనుంది. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం ఇరు జట్లకు అత్యంత కీలకం.
దాంతో ఆట ఆరంభానికి ముందే ఈ పోరు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. లంకలో అడుగు పెట్టింది మొదలు ముమ్మర ప్రాక్టీస్ చేసిన గిల్‌సేన.. ఆతిథ్య జట్టు చేతిలో గత 18 ఏండ్లుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోని రికార్డును కొనసాగించాలని పట్టుదలగా బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు స్వదేశంలో అనుకూలతలకు తోడు తమకు అత్యంత బలమైన స్పిన్ వలతో భారత్ పని పట్టాలని లంక ఆశిస్తోంది. దాంతో గాలె పోరు తొలి రోజు నుంచే రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ టీ20 ప్రపంచకప్, ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీ లాంటి పరిమిత ఓవర్ల టోర్నీల్లో విజేతగా నిలిచింది. ఏ కోచ్‌కైనా ఇది గొప్ప ఘనతే అయినా.. గౌతీ మాత్రం ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకు ప్రధాన కారణం స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ల్లో ఎదురైన అవమానకర ఓటములే. ఈ వైట్‌వాష్‌లు మన జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సిరీస్ ఓడిపోతే గంభీర్ పదవికి తక్షణ ముప్పేమీ లేకపోయినా.. టెస్టుల్లో భవిష్యత్తు కార్యాచరణపై బోర్డు వర్గాల్లో తీవ్ర చర్చ సాగే అవకాశం ఉంది. దాంతో ఈ సిరీస్ నెగ్గి సంప్రదాయ ఫార్మాట్లో జట్టు ఆటను గాడిలో పెట్టాలని గౌతీ భావిస్తున్నాడు. అయితే గాలెలో లంకకు అద్భుత రికార్డుంది.
1998 నుంచి ఇక్కడ ఆడిన 49 టెస్టుల్లో ఆతిథ్య జట్టు ఏకంగా 27 మ్యాచ్‌లు గెలిచింది. మురళీధరన్, రంగన హెరాత్ శకం ముగిసినప్పటికీ ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్ రూపంలో లంకకు బలమైన స్పిన్ దళం ఉంది. గతంలో మిచెల్ శాంట్నర్, సైమన్ హార్మర్ స్పిన్ ధాటికి చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లకు ఇది మళ్లీ పెద్ద పరీక్షే కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గిల్ బ్యాటర్‌గానూ జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. టాపార్డర్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగే దేవదత్ పడిక్కల్ నుంచి భారీ పరుగులు అవసరం.
కీపర్ రిషబ్ పంత్, స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సర్ఫరాజ్ కంటే మొగ్గున్న ధ్రువ్ జురెల్ కెరీర్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఫామ్ కోల్పోయిన ఈ ఇద్దరూ లంక స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఆల్‌రౌండర్ జడేజా జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడిగా స్పిన్ విభాగానికి నేతృత్వం వహించనున్నాడు. అతనికి తోడుగా చైనామన్ కుల్దీప్, మానవ్ సుతార్‌తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
గత 13 నెలల్లో రెండు టెస్టులు ఆడిన ధనంజయ డిసిల్వా నాయకత్వంలోని శ్రీలంక, సొంతగడ్డపై తమ స్పిన్ అస్ర్తాలతో భారత్‌ను దెబ్బతీయాలని భావిస్తోంది. దశాబ్ద కాలంగా లంక టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న స్పిన్ లీడర్ ప్రభాత్ జయసూర్యతో పాటు రమేష్ మెండిస్ ఆతిథ్య జట్టు ప్రధాన బౌలింగ్ అస్ర్తాలుగా మారనున్నారు. అనుభవం కోసం వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెలాను ఆతిథ్య జట్టు తిరిగి జట్టులోకి తీసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పిచ్‌పై కాస్త తేమ ఉంటే ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించే చాన్సుంది.
భారత్ : రాహుల్, జైస్వాల్, పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ (కీపర్), జురెల్, జడేజా, సుతార్, కుల్దీప్ , సిరాజ్, ప్రసిద్ధ్. శ్రీలంక : ఇగాలగమగే, నిషాన్ , చందిమల్, కమిందు మెండిస్, డిసిల్వా (కెప్టెన్), డిక్వెలా (కీపర్), దినూష, ప్రభాత్, రమేష్, అసిత ఫెర్నాండో, లహిరు కుమార.