హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : సవాలక్ష ఆంక్షలతో ఇప్పటికే రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యాయి. వ్యవసాయ పథకాల్లో అర్హులను కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. ఇందులో భాగంగానే ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో కొత్త నాటకానికి తెరతీశాయి. ఇకపై రైతులు పత్తి, ధాన్యం, మక్కజొన్న అమ్ముకోవాలన్నా, పీఎం కిసాన్, రైతుభరోసా రావాలన్నా, యూరియా కొనుగోలు చేయాలన్నా ఫార్మర్ రిజిస్ట్రీకి లింకు పెట్టాయి. రిజిస్ట్రేషన్ ఐడీ ఉంటేనే రైతుగా గుర్తిస్తారు.
లేకపోతే ఎంత పంట పండించినా సర్కార్ కొనుగోలు చేయదు. పంట ఉత్పత్తుల విక్రయాలు, వ్యవసాయ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరి చేశాయి. ఇకపై యూరియా కావాలన్నా, పత్తి, ధాన్యం, కందులు, మక్కజొన్న, జొన్న, పెసర ఇలా పంట ఉత్పత్తులు విక్రయించడానికి ఫార్మర్ రిజిస్ట్రీ ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వచ్చే 11 అంకెల ఐడీని నమోదు చేస్తేనే రైతులకు ఈ వెసులుబాటు కలుగుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెలాఖరు వరకు అవకాశం ఉన్నది. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు ఆయా గ్రామాల ఏఈవోలను సంప్రదించాల్సి ఉంటుంది. రైతులు, వారి భూముల డిజిటలైజేషన్‌తో పాటు పంటల కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది.
యూరియా పంపిణీకి, పీఎం కిసాన్‌కు, పత్తి కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరి చేసింది. ఇదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం నడువనున్నట్టు తెలిసింది. రాష్ట్రం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలకు ముఖ్యంగా రైతుభరోసా, యాంత్రీకరణ స్కీములకు కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే ధాన్యం కొనుగోళ్లకు కూడా తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అంటే ఒకవేళ యాసంగిలో ప్రభుత్వం రైతుభరోసా జమ చేస్తే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.