హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీలు), అర్బన్ రెసిడెన్షియల్ హైసూళ్ల(యూఆర్ఎహెచ్)లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అరకొర వేతనంతో ఉద్యోగాలు చేస్తున్న వారికి, హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. వచ్చే జీతమంతా హాస్టళ్ల నిర్వహణకే వెచ్చించాల్సి రావడంతో ఇంటి ఖర్చులు తీర్చుకునే పరిస్థితి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో వారి పరిస్థితి ‘చిటికెడు జీతం.. పిడికెడు కష్టాలు’ అన్న చందంగా మారింది. ప్రభుత్వం అడ్వాన్స్ ఇవ్వకపోవడం, సామగ్రి వారే కొనాల్సిరావడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో 495 కేజీబీవీలు, 33 యూఆర్హెచ్లు ఉన్నాయి. కేజీబీవీల్లో 1.52 లక్షలు, యూఆర్హెచ్లలో 2,800 మంది విద్యార్థులున్నారు. అయితే, కేజీబీవీల నిర్వహణ మొత్తం స్పెషలాఫీసర్లే చూసుకోవాలి. ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకోసారి బిల్లు ఇస్తున్నది. బిల్లులు వచ్చే వరకు అయ్యే వ్యయభారం స్పెషలాఫీసర్లే వెచ్చించాల్సి వస్తున్నది. గ్యాస్ సిలిండర్లు, బియ్యం, రవాణా, హమాలీ, స్టేషనరీ తదితర ఖర్చులు భరించాల్సి వస్తున్నదని ఎస్వోలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిల ఉంటే తీరా బడ్జెట్ విడుదలైన తర్వాత తాము ఖర్చు చేసిన మొతాన్ని నేరుగా తమ ఖాతాల్లో జమ చేయకుండా థర్డ్ పార్టీ వెండర్ల ఖాతాల్లో వేయడంతో వాటిని తిరిగి రాబట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
ఎస్‌వోలకు నెలకు రూ.32,300 జీతం చెల్లిస్తున్నారు. కానీ, హాస్టళ్ల నెలవారీ ఖర్చులు మాత్రం రూ.50వేలకు పైగా అవుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉండటం తమకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకో కేజీబీవీలో విద్యార్థినుల సంఖ్యను బట్టి నెలకు సుమారు 20 నుంచి 25 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతున్నాయి. దీంతో ఒక్క గ్యాస్‌కే నెలకు రూ.25 వేలకుపైగా వెచ్చించాల్సి వస్తున్నదని అంటున్నారు. సగటున 300 మంది విద్యార్థినులు ఉన్న కేజీబీవీలో నెలకు రూ. 4,500 కిలోల బియ్యం కావాల్సి ఉంటుంది. కిలోకు రూ.1 చొప్పున డీడీలు కట్టాల్సిందే. స్టాక్ పాయింట్ నుంచి కేజీబీవీకి బియ్యం రవాణా, లోడింగ్, ఆన్లోడింగ్ హమాలీ చార్జీలూ ఎస్వోలే చెల్లించాల్సి వస్తున్నది. ఇవన్నీ కలిపితే రూ. 2వేలు ఖర్చుచేయాల్సి వస్తున్నదంటున్నారు. ఇక రోజువారీ నిర్వహణ, విద్యుత్తు, ప్లంబింగ్, మోటర్లు, సెప్టిక్ ట్యాంక్ తదితర పనులు, స్టేషనరీ కోసం నెలకు సుమారు రూ.15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇవన్నీ కలిపితే మొత్తంగా నెలకు సుమారు రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాము ఎదురొంటున్న ప్రధాన సమస్యకు శాశ్వత పరిషారం చూపాలని ఎస్వోలు కోరుతున్నారు. ఈ విధానాన్ని మార్చి హాస్టల్ సామగ్రిని ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని, లేదంటే ముందస్తు నిధులు అందించాలని కోరుతున్నారు. బియ్యం, గ్యాస్, మెయింటెనెన్స్, స్టేషనరీ వంటి అవసరాలకు ప్రత్యేకంగా టెండర్లు పిలిచి, ఎంపికైన సరఫరాదారుల ద్వారానే నేరుగా పాఠశాలలకు సరఫరా చేయించాలని ప్రత్యేకాధికారులు కోరుతున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మధ్యాహ్న భోజన బియ్యం నేరుగా పాఠశాలలకు సరఫరా చేస్తున్న విధానాన్నే కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ సూళ్లు, గర్ల్స్ అటాచ్డ్ మోడల్ సూళ్లకూ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.