వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 23: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఎంజీఎం దవాఖానలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిగాయాలపాలై చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడానికి ఎంజీఎంకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆయన గాయాలపాయ్యారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఎంజీఎం హాస్పిటల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఎంజీఎం మార్చురీ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. తనకు తగిలిన గాయానికి ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటానని చెప్పినా వినకుండా పోలీసులు ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. దాస్యం ఆవేదనను అర్థం చేసుకోకుండానే పోలీసులు ఆయనపైనే కేసు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. మట్టెవాడ ఎస్సై శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు విచారణ అధికారిగా మరో ఎస్సై సాంబయ్య కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంజీఎం హాస్పిటల్ సందర్శనను అడ్డుకున్న పోలీసుల తీరుకు వ్యతిరేకంగా దాస్యం రాస్తారోకో చేయడాన్ని తప్పుబడుతూ కేసు నమోదుచేశారు. దాస్యం వినయ్‌భాస్కర్‌ను మొదటి ముద్దాయిగా చేర్చి మరో 15 మందిపై కేసునమోదు చేశారు. మట్టెవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో వడిచెర్ల ప్రసాద్, కొడకండ్ల సదాంత్, జోరిక రమేశ్, పులి రజనీకాంత్, సోదా కిరణ్, దర్శన్‌సింగ్, పోలెపాక రాములు, బైరుపాక ప్రశాంత్, ఖాజా, ప్రణయ్, నయీం, పస్తం అనిల్, యూసుఫ్, యాదగిరి, సృజన్‌తోపాటు మరికొందరు ఉన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు పోలీసే.. విచారణాధికారి పోలీసే కావడంతో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులపై కేసు పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దాస్యం వినయ్భాస్కర్పై కేసులు పెట్టడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమా? అని నగరవాసులు మాట్లాడుకుంటున్నారు. ఎంజీఎం హాస్సిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, ఆ హాస్పిటల్ పరిస్థితిని ప్రజలకు చూపించడానికి, వైద్య రంగంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వెళ్తున్న విషయాన్ని గ్రహించి ఉద్దేశపూర్వకంగానే పోలీసులను అడ్డుపెట్టి రాజకీయ ఒత్తిడితో అక్రమంగా కేసులు నమోదు చేయించినట్టు కొందరు ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది సైతం చెవులు కొరుక్కుంటున్నారు. హాస్పిటల్లోకి వెళ్లి అక్కడి పరిస్థితిని ప్రజల ముందు నిలిపితే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని భావించిన ఓ ఎమ్మెల్యే ఈ పోలీస్ చర్యకు ఒడిగట్టినట్టు చెప్పుకొంటున్నారు. ప్రజా సమస్యలపై స్పందించిన నాయకుడిపై తప్పుడు కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురిచేయాలని చూడటం సరైన పద్ధతికాదని అధికార పార్టీ తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు.