BRS Protest | రాయపోల్, ఫిబ్రవరి 01 : తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు పోరాడి.. తెలంగాణ సాధనకు కృషి చేసిన నాయకుడు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై అక్రమ కేసులతో సిట్ విచారణ చేయడం రాజకీయ ప్రతీకారమేనని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ ఆరోపించారు.
కేసీఆర్పై సిట్ విచారణను నిరసిస్తూ రాయపోల్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు రాజిరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ..
కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ విచారణ ప్రారంభించడం ప్రభుత్వం చేసిన రాజకీయ ప్రతీకార చర్యగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజల్లో కేసీఆర్ కు ఉన్న ఆదరణను తట్టుకోలేక ప్రభుత్వం ఈ విచారణ నాటకాన్ని మొదలు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పేరును ఆయుధంగా మార్చుకుందన్నారు. సిట్ విచారణకు ముందు ఏ ఆధారాలు బయటపెట్టారు. ఏ న్యాయసమ్మత కారణాలు చూపారో చెప్పకుండానే ఉద్యమ నాయకుడిపై వేసే నిందలు, ప్రభుత్వం ఆడే నాటకాలు సరైనవి కాదన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బుద్ది చెప్పడం ఖాయం..
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని.. ఉద్యమాన్ని చూసిన ప్రజలు, చరిత్రను సృష్టించిన ప్రజలు కేసీఆర్పై జరుగుతున్న దాడిని వారు నిశితంగా గమనిస్తున్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నుండి మొదలుకొని కొండపోచమ్మ వరకు ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు అందిస్తే కాళేశ్వరం కూలిపోయింది అంటూనే నీళ్లు విడిచేందుకు పోటీ పడుతున్నారని విమర్శించారు. అనంతరం సిట్ విచారణకు నిరసనగా రాయపోల్ మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కేసీఆర్పై చేసిన ఆరోపణలు సరైనవి కావని అన్నారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను సీఐ లతీఫ్ ఆధ్వర్యంలో సముదాయించి ధర్నా చేస్తున్న నాయకులను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొంగరి స్వామి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గణేష్, గల్వ దయాకర్ రెడ్డి, మాదాస్ నవీన్ గౌడ్, మంతూరి యాదగిరి గౌడ్, రాజారాం మధు, సందీప్ రెడ్డి, మాదాస్ మురళీ గౌడ్, చింత కింది మహేష్, గడ్డమీద రాజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

