The Paradise | నేచురల్ స్టార్ నాని మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తుండగా, ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. థియేట్రికల్ హక్కుల వ్యాపారంలో ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రంగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ రూ.82 కోట్ల నుంచి రూ.84 కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో నాని మార్కెట్ స్థాయి మరో మెట్టుకు చేరిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.37 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో రికవరీ క్లాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డీల్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, నిర్మాత సుధాకర్ చెరుకూరి భాగస్వాములుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నైజాం ప్రాంతంలోనే ఈ స్థాయి బిజినెస్ జరగడం నాని కెరీర్లో అరుదైన మైలురాయిగా భావిస్తున్నారు. కోస్తాంధ్ర హక్కుల కోసం కూడా డిస్ట్రిబ్యూటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అక్కడ కూడా సుమారు రూ.35 కోట్ల స్థాయిలో బిజినెస్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటు రాయలసీమ (సీడెడ్) హక్కుల విషయంలో నిర్మాతలు రూ.12 కోట్ల నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ కోరుతున్నట్లు తెలుస్తోంది. పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నప్పటికీ, తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో నాని నటించిన ‘హిట్ 3’ సినిమా సుమారు రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ఆయన కెరీర్లో అత్యధిక రికార్డు సృష్టించింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఆ సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తూ కొత్త బెంచ్‌మార్క్‌ను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస విజయాలతో నాని పాన్ ఇండియా మార్కెట్ మరింత బలపడిందని ఈ బిజినెస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ ను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 23న ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.