జహీరాబాద్, ఫిబ్రవరి 1 : మురుగునీటి ప్రవాహంతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను తొలగించేందుకు గ్రామ సర్పంచ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలోని అల్లాదుర్గ్ మెటల్ కుంట రోడ్డు మార్గంలోని కాలనీ నుంచి మురుగునీరు ప్రవహిస్తుంది. గత కొంతకాలంగా ఈ మురుగునీరు రైతులు రాకపోకలు సాగించే దారి గుండా వెళ్తుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొలాల్లో సాగు చేసిన దాన్యరాశులు, చెరుకు వాహనాల్లో క్రషింగ్ కు తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
రాత్రుల్లో పొలాలకు వెళ్లాలంటే నానా అవస్థలకు గురికావాల్సి వస్తుందని రైతులు వాపోయారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ మాత్రం శెట్టి ప్రవీణ్ కుమార్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి జేసీబీతో మురుగునీటిని కాల్వను తవ్వి దారి మళ్లించారు. దీంతో రైతుల కష్టాలు దూరమవడంతో సంతోషం వ్యక్తం చేశారు.