రాయపోల్ ఆగష్టు 01. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. మరో 5,300 ఎకరాల్లో వరి పంట సాగుపై రైతులు దృష్టి సారించారు. గత వారం రోజులగా బోరుబావుల వద్ద వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
స్థానిక కూలీలతో పాటు బీహార్ నుంచి వచ్చిన కూలీలు కూడా వరి నాట్లు వేస్తున్నారు. కేవలం బోరు బావులు ఉన్న రైతులే వరి పంటపై దృష్టి సారించారు. మండలంలో1,300 ఎకరాల్లో మొక్కజొన్న వేయగా మరో 300 ఎకరాల్లో కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు.
ఎలాంటి సాగునీటి వనరులులేని రైతులు పత్తి పంట వైపు మోగ్గు చూపుతున్నారు. మండల వ్యాప్తంగా వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సలహాలు సూచనలు క్షేత్రస్థాయిలో పర్యటించి సూచిస్తున్నారు. యూరియా కొరత ఉండడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ పంటలు సాగులో నిమగ్నమయ్యారు. మల్లన్న సాగర్. కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా నీరు అందించి గొలుసు కట్ట చెరువులను నింపితే వరి సాగు మరింత ఎక్కువగా సాగు అవుతుండేదని రైతులు పేర్కొంటున్నారు. కాల్వలు పూర్తి చేసినప్పటికీ నీటిని విడుదల చేయకపోవడంతో వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో బోరు బావులు లేని రైతులు పత్తి మొక్కజొన్న పంటలపై ఆధారపడి జీవిస్తున్నారు. గొలుసు కట్టు చెరువులు నింపితే పంటలు బాగా పండేవని రైతులు వాపోతున్నారు.