YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు ధ్వజమెత్తారు. నెల్లూరుకు వెళ్లి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడాన్ని వారు తప్పుబట్టారు. మహిళలను కించపరిచి సాధించేదేంటని ప్రశ్నించారు. వైసీపీకి మహిళల ఓట్లే తప్ప.. వారిని గౌరవించడం తెలియదని విమర్శించారు.
మహిళలను కించపరిచి జగన్ సాధించేందేంటి అని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. సొంత చెల్లి, తల్లిని కూడా దగ్గరకు రానీయని జన్మ ఎందుకో ఆలోచించుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం నాడు ఆనం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రౌడీల నాయకుడో, గంజాయి గ్రూపుల నాయకుడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో దోచుకున్నదంతా భయపడుతుందనే భయం జగన్‌కు పట్టుకుందని ఆనం అన్నారు. వైసీపీలో ఎవరైనా ఒకరిద్దరు విజ్ఞులు ఉంటే వాళ్లు ఇప్పటికైనా పార్టీని వీడండి అని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి మహిళల ఓట్లే ముఖ్యం కానీ.. వారిని గౌరవించడం తెలియదని అన్నారు.
ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాంలో వేళ్లన్నీ మాజీ సీఎం జగన్‌వైపే చూపిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణాలకు పాల్పడిన వైసీపీ నేతలను అరెస్టు చేస్తుంటే.. జగన్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు భయంతో జగన్ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
బందిపోటు దొంగల కంటే జగన్ ప్రమాదకరమైన వ్యక్తి అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. రూ.3700 కోట్ల అక్రమార్జన కోసం జే బ్రాండ్లు తాగించి ప్రజల ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు, అసత్య ప్రచారాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా జైలుకెళ్లి మొసలి కన్నీళ్లు కార్చారని దుయ్యబట్టారు. మహిళలను కించపరిచేవాళ్లు, దూషించేవాళ్లను ప్రోత్సహించడమే జగన్ పని ఆయన విమర్శించారు. జగన్ అవినీతి ఆకలి, అరాచకాల కారణంగానే ఎంపీ మిథున్ రెడ్డి జైలు పాలయ్యారని ఆరోపించారు. పరామర్శ పేరుతో యాత్రలు, ర్యాలీలు చేపట్టి ఉద్రిక్తతలను పెంచుతున్నారని మండిపడ్డారు.