BRS Protest | తొగుట, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. తెలంగాణ ప్రదాత కేసీఆర్ఫై అక్రమ కేసులను యావత్ తెలంగాణ ప్రజలు నిరసిస్తున్నారని, కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్ని గుండమే అవుతుందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి హెచ్చరించారు..
కేసీఆర్‌పై సిట్ విచారణను నిరసిస్తూ తొగుటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్ విచారణ ప్రారంభించడం ప్రభుత్వం చేసిన అత్యంత నీచమైన రాజకీయ ప్రతీకార చర్యగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యతో చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.
కేసీఆర్‌ను భయపెట్టలేక, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను తట్టుకోలేక ప్రభుత్వం ఈ విచారణ నాటకాన్ని మొదలుపెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పేరును ఆయుధంగా మార్చుకుందన్నారు. సిట్ విచారణకు ముందు ఏ ఆధారాలు బయటపెట్టారు..? ఏ న్యాయసమ్మత కారణాలు చూపారు..? ఇవేమీ లేకుండానే ఒక ఉద్యమ నాయకుడిని, రాష్ట్ర నిర్మాతను నిందల బాటలో నెట్టే ప్రయత్నం చేయడం ప్రభుత్వ రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ఠ అన్నారు.
అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. ఉద్యమాన్ని చూసిన ప్రజలు, చరిత్రను సృష్టించిన ప్రజలు, కేసీఆర్‌పై జరుగుతున్న ఈ దాడిని వారు నిశితంగా గమనిస్తున్నారని ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
ఇంటికి నోటీసులు అంటించడం సిగ్గు చేటు..
కేసీఆర్ ఎర్రవల్లిలో ఉన్నప్పటికీ నందినగర్‌లో ఆయన లేనప్పుడు ఇంటికి నోటీసులు అంటించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుతారి రమేష్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నుండి మొదలుకొని కొండపోచమ్మ వరకు ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు అందిస్తే కాళేశ్వరం కూలిపోయింది..అంటూనే నీళ్లు విడవడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. అనంతరం సిట్ విచారణ కు నిరసనగా నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలువేరు మల్లారెడ్డి, వేల్పుల స్వామి, కంది రాంరెడ్డి, కుర్మ యాదగిరి, పబ్బతి వెంకట్ రెడ్డి, మంగ నర్సింలు, ఎల్లం, యాదగిరి. అరుణ్ కుమార్. శ్రీనివాస్ గౌడ్, నరేందర్ గౌడ్, బోయిని శ్రీనివాస్, చెరుకు లక్ష్మారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. వెంకటేశం గౌడ్, హాబిద్ హుస్సేన్, సుభాష్ గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, కోల శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పవన్, కరుణాకర్, స్వామి,. రమేష్, భాస్కర్, కాళిదాస్ శ్రీనివాస్,జహంగీర్, నరేందర్, భూమయ్య, కత్తుల రమేష్. రాంబాబు, మల్లేశం, పోచయ్య.తదితరులు పాల్గొన్నారు.

