‘ఒక అధికారిని తొలగించండి.. ఆయన స్థానంలో వేరొక సమర్థుడైన వ్యక్తిని నియమించండి’ అనే ఆదేశాలు కోర్టులు జారీ చేయడం అసాధారణమైన విషయమే. జలవనరుల రక్షణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అనే తొమ్మిది తలల వికృత సర్పాన్ని స్వారీ చేస్తూ బస్తీల్లో బుల్డోజర్లతో బీభత్సం సృష్టిస్తున్న కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు అలాంటి ఆదేశాలను, అదీ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ చేయడం తెలిసిందే. 63 కోర్టు ధిక్కార కేసులు దాఖలైనా తీరుమారని అధికారిని తప్పించడం ఒక్కటే మార్గమని కోర్టు అభిప్రాయపడడం రంగనాథ్ మొండివైఖరికి నిదర్శనం. అఫిడవిట్ ద్వారా ఆయన తెలియజేసిన క్షమాపణలను న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం. ఇంత జరిగితే ఎవరైనా నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొంటారు. కానీ రంగనాథ్ అలా చేయకుండా కోర్టు న్యాయ విచక్షణనే ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. భూ ఆక్రమణదారులు కుమ్మక్కై కేసులతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఫక్తు రాజకీయ నాయకుడి తరహాలో ఎదురుదాడికి దిగుతున్నారు. అయినా ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’? అన్నట్టుగా ‘యథా సీఎం తథా అధికారి’ అని ఆయన చాటిచెప్తున్నారు.
ఇక ఈ వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ మాట్లాడుంటే అంత మంచిది. ‘హిట్లర్ నాకు ఆదర్శం.. హిట్లర్ కోర్ టీమ్ పేరునే హైడ్రాకు పెట్టాను’ అన్నారు. అంతేకాకుండా హిట్లర్ హైడ్రా ఎవరినైనా చంపగలదు. హైడ్రా విధ్వంసం కూడా మీకు పాలస్తీనా స్థాయిలో ఉంటుందని ముసిముసి నవ్వులూ నవ్వుతూ తన అపార చరిత్ర పరిజ్ఞానాన్ని వ్యక్తం చేసుకున్నారు సీఎం. నరమేధానికి ప్రతీకగా ప్రపంచం పరిగణించే వ్యక్తి ఈయనకు ఆదర్శమా? అని అంతా ముక్కుమీద వేలేసుకున్నారు. మరి న్యాయవ్యవస్థను ధిక్కరించడంలోనూ ఆ హిట్లరే ఆదర్శమా? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. కోర్టు ఆదేశాలను పాటించాలనే చిత్తశుద్ధి ఆయన మాటల్లో కనిపించడం లేదు. పైగా కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారుల నియామకాలపై తిరుగులేని అధికారం ఉంటుందన్నట్టుగా వితండవాదం చేస్తుండటం విడ్డూరం. కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలు కోర్టుల న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయనే కనీస పరిజ్ఞానం ఒక రాష్ట్ర సీఎంకు లేకపోవడం విచారకరం.
బుల్డోజర్లతో సృష్టించిన బీభత్సానికి హైడ్రా తీవ్రమైన వివాదాల్లో చిక్కుకున్నది. అంతకంటే ఎక్కువగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్తలకెక్కారు. పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం అనేది ఆయనపై ప్రధానమైన ఆరోపణ. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టడం వంటివి న్యాయపరంగా ఏమాత్రం సమర్థనీయంకాని విషయాలే. ఇండ్లల్లో వండుకున్న అన్నం, చిన్నపిల్లల పుస్తకాలు కూల్చివేతల్లో చెల్లాచెదురైన దృశ్యాలు ప్రజలను కలచివేశాయి. జలాశయాల్లో ఆక్రమణలు రాత్రికిరాత్రే రాలేదు. కనుక ఇప్పటికిప్పుడు కూల్చేస్తా అనడం కుదరదు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు కట్టుకున్న ఇండ్లపైకి నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లను తోలడం అత్యంత అభ్యంతరకరమైన విషయం. ఇక కూల్చివేతలకు చూపుతున్న మరో కారణం కాలుష్యం. అందుకు జలాశయాల చేరువలో ఉన్న బస్తీల కన్నా, విష రసాయనాలను అనునిత్యం ఒలకబోస్తున్న పరిశ్రమల పని పట్టడం ముఖ్యం కదా. ఏదైనా చూసే దృష్టిని బట్టే ఉంటుంది. కాలచక్రాన్ని పూర్తిగా వెనుకకు తిప్పడం సాధ్యం కాదు. పైగా సర్కార్ వ్యవహరిస్తున్నది ప్రజలతో! శత్రు సైనికులతో కాదనేది హిట్లర్ అభిమానులు గుర్తుంచుకోవాలి.