ఓ జాతీయ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడి కుమారుడు పోక్సో కేసులో బండి భగీరథ్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు చాలా విచిత్రమైనది. జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కంప్లయింట్ తీసుకోవడానికి కూడా పోలీసులు స్పందించలేదు. కేసు పెట్టడానికి వెళ్లిన వాళ్లనే బెదిరించారని ప్రచారం జరిగింది. పోలీసుల వైఖరి దుర్మార్గపు చర్య అని అర్థమవుతున్నది. గంటల తరబడి నిరీక్షింపజేసిన తర్వాత, పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా తొమ్మిదిరోజులపాటు నిందితుడిని అరెస్ట్ చేయలేదు. కేసు వెనక్కి తీసుకొనేలా బాధిత కుటుంబానికి బెదిరింపులు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. బాలిక పట్ల అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ ప్రజలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీల శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పుకొచ్చారు. పరారీలో ఉన్న నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా మెయిల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో గత్యంతరం లేక కేసు నమోదైన తర్వాత తొమ్మిదోరోజు నిందితుడి లొంగుబాటో, అరెస్ట్ జరిగింది. మొత్తానికి నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపర్చి, చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడితో ఓ ఘట్టం ముగిసింది.
అయితే జైలులో ఉన్న నిందితుడు బెయిల్ కోసం పలుమార్లు కోర్టును ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఏదో కారణంతో వారం రోజులు బెయిల్ కోరగా కోర్టు మంజూరు చేసింది. తిరిగి ఈ నెల 8న బెయిల్ పొందాడు. నిందితుడికి బెయిల్ మంజూరు చేయకుండా ప్రభుత్వ న్యాయవాదులు సమర్థవంతమైన వాదనలు వినిపించలేదని స్పష్టమవుతున్నది. అంటే, రాజకీయ నాయకుల సుపుత్రులకు ఒక న్యాయం, సామాన్యులైన నిందితులకు ఒక తీరు తీర్పులు ఉంటాయని జనం అనుకొంటున్నారు. ఇకముందు కానీ ఇప్పుడు ఉన్న పోక్సో కేసు నిందితులకు కానీ బండి భగీరథ్ బెయిల్ ఒక తొవ్వ అవుతుందని అనుకోవచ్చా? మిగతా నిందితుల విషయంలోనూ చట్టం ఇలాగే వ్యవహరిస్తుందా? అని కోర్టు న్యాయాధికారులపై సందేహం నెలకొన్నది.
కాంగ్రెస్-బీజేపీ బంధం ఫెవికాల్ బంధం అని ప్రజలు అంటుంటారు. అది బహుశా నిజమే కావచ్చు అని నా అభిప్రాయం. పగలు తిట్టుకోవడం రాత్రిళ్లు ఆలింగనం చేసుకోవటం తరహాలో రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసు పదేండ్లుగా పెండింగ్‌లో పెట్టడం బీజేపీ బాసులు- పోలీసుల దౌర్బల్యం. అలాగే ఓ కేంద్రమంత్రి కుమారుడిని పోక్సో కేసు నుంచి తప్పించి బెయిల్ ఇప్పించేందుకు సహకరించటం Reciprocal ఇచ్చి పుచ్చుకోవటం సిద్ధాంతం. న్యాయాధికారులను అడిగేది ఏందంటే, ఓ కేంద్రమంత్రి కొడుకు కేసు, ఉన్నత కుటుంబీకులు, రాజకీయ నేపథ్యం కలిగిన బడానేతలకు ఒక తోవ చూపించినట్టుగానే ఇతర నిందితులకు కూడా బెయిల్ ఇచ్చి విముక్తులను చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా, పోలీసు బాసులు కూడా సహకరిస్తారా అనే సందేహం కలుగుతున్నది. అలా కుదరదు చట్టం కొందరికి చుట్టం అంటారా? ఏమో మరి!