Rains | జహీరాబాద్, జూలై 1: వర్షాలు కురుస్తాయనే ఆశతో విత్తనాలు నాటిన పత్తి రైతులు వరుణుడు ముఖం చాటేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ వానాకాలంలో ఆలస్యంగా రుతుపవనాలు రావడంతో అక్కడక్కడా వర్షాలు కురిసాయి. రైతులు దుక్కి దున్ని అచ్చు తోలి, పత్తి విత్తనాలు విత్తారు. అయితే విత్తిన నాటి నుంచి నేటి వరకు వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు పొట్టిపోతున్నాయి.
కొంత మంది బోరు, బావులు ఉన్న రైతులు స్పింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతున్నారు. విత్తనాలు మొలకెత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులు ముందస్తు వర్షాలు కురువడంతో సాగుకు భూములను చదును చేసి దుక్కులు దున్ని విత్తులు వేశారు. వర్షాకాలం ప్రారంభ దశలో ముందు మురిపించిన వర్షం.. ఆపై మిన్నకుండి పోయింది. దీంతో పంట చేలో మొలకలకు బదులుగా రైతుల గుండెల్లో కరువు రక్కసి కాటేస్తుందన్న భయం పరుగెడుతుంది.
పంటల సాగుల కోసం అప్పులు తెచ్చి మొక్కలకు ప్రాణం పోశారు. ఆ మొక్కల ప్రాణం వర్షపు చినుకులతో చిగురించాలని ఆశగా వానదేవుడా.. కరుణించవా అంటూ గ్రామాల్లో గ్రామ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తూ ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లో మొలికెత్తిన మొక్కలను కాపాడుకునేందుకు డ్రిప్ స్ప్లింగ్ ద్వారా సాగునీటి అందించి కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రైతులందరూ ఆకాశం వైపు చూస్తూ వానమ్మ వానమ్మ ఒక్క సారైన వచ్చి పోయే వానమ్మ అంటూ కంట పడిన దేవుళ్లను మొక్కుతున్నారు. రైతుల మొరను విని వాన దేవుడు కరుణించాలని.. వర్షాలు సమృద్ధిగా కురువాలని ఆశిద్దాం.. రైతన్నను ఆశీర్వదిద్దాం.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు