IPL 2026 : ఐపీఎల్ సీజన్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించింది. అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమే. ఎస్ఆర్హెచ్ జట్టుకు కొన్ని సీజన్ల నుంచి రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ కొన్ని ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కమిన్స్ ఎస్ఆర్హెచ్ జట్టుతో చేరేవరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బుధవారం అధికారికంగా వెల్లడించింది.
మరోవైపు ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 193 స్ట్రైక్‌రేట్‌తో కిషన్ 317 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ శర్మ పూర్తి స్థాయిలో రాణించకపోయినా.. కొన్ని మ్యాచుల్లో తనదైన శైలిలో ఆడి ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ గత ఏడాది ఝార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ (టీ20)లో ఝార్ఖండ్‌ను విజేతగా నిలబెట్టాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రాణించాడు. 10 మ్యాచుల్లో 197 స్ట్రైక్ రేట్‌తో 517 పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీ కూడా సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్రోఫీని అందించాడు. అందుకే కెప్టెన్‌గా అతడికున్న అనుభవంతో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టుకు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ మంచి విజయాల్ని అందిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
ఒకప్పుడు జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్ ఇప్పుడు అద్భుతమైన ఆట తీరుతో ప్రామిసింగ్ ప్లేయర్‌గా మారాడు. పాట్ ప్రస్తుతం వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అందువల్లే ఆయన ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లో కూడా పాల్గొనలేదు. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులోనే ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తలపడనున్నాయి.