Ram Mohan Naidu | ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్ (Black Box) ప్రమాదంలో దెబ్బతిన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తాజాగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉందని వెల్లడించారు. దీనిని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బృందం పరిశీలిస్తోందని తెలిపారు.
పూణెలో జరిగిన ఓ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ బాక్స్ గురించి ఆయన్ని విలేకర్లు ప్రశ్నించారు. విశ్లేషణ కోసం బ్లాక్‌బాక్స్ విదేశాలకు పంపుతున్నారా..? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. అవన్నీ అవాస్తవాలే. బ్లాక్‌బాక్స్ ప్రస్తుతం భారత్‌లోనే ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బృందం పరిశీలిస్తోంది’ అంటూ సమాధానమిచ్చారు.
కాగా, ఈనెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ AI-171 విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై ఉప్పకూలిన విషయం తెలిసిందే. విమానం కూలిన వెంటనే దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 270 మంది వరకూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదం జరిగిన దాదాపు 27 గంటల తర్వాత ఈ బ్లాక్‌బాక్సును విమానం కూలిన బిల్డింగ్‌పై గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ఈ బ్లాక్ బాక్స్ చాలా కీలకం. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని విశ్లేషించేందుకు విదేశాలకు పంపుతున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.
సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఎయిర్ ఇండియా విమానం కూలని అనంతరం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ధాటికి బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
Also Read..
BJP MLA | వందేభారత్ రైల్లో ప్రయాణికుడిపై దాడి.. ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీసులు
Operation Sindhu | 268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న మూడో విమానం