కొచ్చి: కేరళలోని వామపక్ష ప్రభుత్వం .. బ్లాక్‌మ్యాజిక్(Black Magic) బ్యాన్ అంశంపై వెనక్కి తగ్గింది. చేతబడి, క్షుద్రపూజలు లాంటి అమానవీయ ప్రక్రియలను బ్యాన్ చేయాలనే చట్టాన్ని రూపొందించడం లేదని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ విధానంలో భాగంగా రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్లాక్‌మ్యాజిక్‌ను బ్యాన్ చేసే చట్టాన్ని తయారు చేస్తున్నారా అన్న అంశంపై కేరళ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ నితిన్ జామ్దార్ నేతృత్వంలో ఆ పిల్‌ను విచారించారు. బ్లాక్‌మ్యాజిక్‌ను బ్యాన్ చేసే అంశంపై ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు పిల్లో పేర్కొన్నారు. కానీ విస్తృత స్థాయిలో మంత్రివర్గం చర్చించిన తర్వాత.. 2023, జూలై 5వ తేదీన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఆ ముసాయిదాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పిల్లో లేవనెత్తిన అంశాలను కోర్టు పరిశీలించినా.. ఆ ముసాయిదాను చట్టంగా మార్చాలని ప్రతినిధులపై వత్తిడి తీసుకురాలేమని కోర్టు చెప్పింది. చట్టం చేయలేని పక్షంలో.. చేతబడి, క్షుద్రపూజల్లాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
చేతబడిని బ్యాన్ చేసే చట్టాన్ని రూపొందించాలని కేరళ యుక్తివాది సంఘం కోర్టులో పిల్ వేసింది. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాల తరహాలో చట్టాన్ని తయారు చేయాలని డిమాండ్ చేశారు.