‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సూక్తి మనిషికే కాదు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ వర్తిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచీ (ఎఫ్హెచ్ఐ) తెలంగాణ ఆర్థిక ఆరోగ్యం ఫిట్‌గా ఉన్నట్టు ధ్రువీకరించింది. గణాంకాలను బేరీజు వేసుకుంటూ వచ్చే బడ్జెట్లో కేటాయింపులు జరిగితే, తెలంగాణ ఆర్థికంగా మరింత ధృడంగా మారడం ఖాయం. మనుషులు ఆరోగ్యంగా ఉన్నారో లేరో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, షుగర్ లెవల్స్, ఈసీజీలు ఎలాగో.. ఒక రాష్ట్రం ఆర్థికంగా ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఆర్థిక ఆరోగ్య సూచీ అలాగే.
హెల్త్ రిపోర్టుల ఆధారంగా చికిత్స కోసం డాక్టర్లు ప్రిస్కిప్షన్ రాస్తారు. అలాగే రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య పరిపుష్ఠికి బడ్జెట్లో కేటాయింపులు, ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన 2023-24 నివేదికలు ప్రభుత్వానికి దిక్సూచిలా మారనున్నాయి. 2034 నాటికి తెలంగాణ ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు జరుపుకొనే నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని చెప్పుకొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రకటించింది. ‘చేతిలో పైసా ఉంటే కొండ మీది కోతినైనా దించవచ్చు’ అంటారు. కానీ, ఆ పైసా సంపాదించడం ఎలా అన్నది ముఖ్యం.
పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం జీతాలు, పెన్షన్లకే పరిమితం కాకుండా, ఆస్తుల సృష్టిపై దృష్టి సారించింది. 2019-20లో రూ.16,860 కోట్లుగా ఉన్న మూలధన వ్యయాన్ని 2023-24 బడ్జెట్ నాటికి రూ.43,918 కోట్లకు (దాదాపు 160 శాతం) పెంచింది. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటిని అందించడం ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి ఆదాయం వృద్ధి సాధ్యమైంది. ఆర్థిక వనరులను వృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధించింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయాన్ని 74 శాతం నుంచి 80 శాతానికి పెంచుకోవడం ద్వారా కేంద్ర గ్రాంట్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నేతర ఆదాయం ఏటా 33 శాతం చొప్పున పెంచుతూ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించింది. ‘అప్పు లేనివాడే అధిక సంపన్నుడు’ అనేది పాత మాట. నేటి ఆర్థిక ప్రపంచంలో అప్పు తీర్చగలిగే శక్తి ఉండటమే గొప్పమాట. కేసీఆర్ ప్రభుత్వం అప్పు తెచ్చిన నిధులతో భారీ ప్రాజెక్టులు నిర్మించి, రైతులు పెద్దఎత్తున పంటలు పండించేలా ప్రోత్సహించింది. తెలంగాణ గ్రామాల్లో ఎన్నో రెట్ల సంపద సృష్టించింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. రాష్ట్ర సంక్షోభంపై సీఎం రేవంత్‌రెడ్డి పలు వేదికల పై చెప్పారు. ఇక ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకొనే దిశగా చర్యలు ఉండాలి. ఆదాయ వనరుల వేట పెంచాలి. కానీ కొత్త ఆదాయ మార్గాలను రేవంత్ సర్కార్ అన్వేషించడంలేదు. గనులు, భూముల అమ్మకాల ద్వారా కాకుండా స్థిరమైన పన్నుయేతర ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలి. ఆదాయాన్ని రెవెన్యూ ఖర్చులకు కాకుండా మూలధన వ్యయాన్ని పెంచే దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. రాష్ర్టానికి పారిశ్రామిక వికేంద్రీకరణ కూడా ఎంతో అవసరం. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించే శక్తులుగా మార్చాలి. ఆస్తులను సృష్టించే మూలధన వ్యయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉన్నది. కేసీఆర్ అప్పులు చేసినా మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ఆస్తుల సృష్టిపై దృష్టి పెట్టారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో చేసిన దాదాపు రూ.3 లక్షల కోట్ల అప్పు ఏమి చేసిందంటే చెప్పడానికి ఏమున్నది?
2023-24 ఎఫ్హెచ్ఐ నివేదిక, రెండేండ్ల కాగ్ గణాంకాలను పరిశీలిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ సరార్కు మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సంక్షేమం-మౌలిక సదుపాయాల సమతుల్యత కోసం కేసీఆర్ ప్రణాళికలు అమలు చేశారు. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో అప్పులు తప్ప పనులు కనిపించడం లేవు. రెవెన్యూ ఖర్చులు పెరిగాయి.
రాష్ట్ర అభివృద్ధికి కొలమానమైన ‘మూలధన వ్యయం’ గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ సర్కార్ మూలధన వ్యయం కింద రూ.44,275.14 కోట్లు వెచ్చించింది. బడ్జెట్ అంచనాలు పెరిగినప్పటికీ 2025-26లో జనవరి వరకు రేవంత్ సర్కార్ రూ.44,376.34 కోట్లే మూలధన వ్యయం కింద ఖర్చుచేసింది. కాంగ్రెస్ పాలకులు భూములు అమ్మి ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు?
బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదు. అది ప్రజల ఆశల ప్రతిరూపం. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, ఉత్పాదక రంగాలపై దృష్టి సారించాలి. అప్పుడే ఆర్థిక ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలంగాణ గర్వంగా చాటుకోగలదు. లేకపోతే రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిన రాష్ట్రం, మరింత దారుణమైన సంక్షోభం ఎదుర్కోకతప్పదు.