సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సృష్టించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. గండిపేటలోని ప్రభుత్వ పోరంబోకు భూమిపై తప్పుడు హకులు చూపిస్తూ నకిలీ జీవోలు తయారు చేసి, సోషల్ మీడి యా ద్వారా ప్రచారం చేసిన ముఠాలోని ముగ్గు రు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతోపాటు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో కూకట్పల్లి డీసీపీ శ్రీనివాస్, క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు యత్నించిన ముఠాపై గండిపేట మండల తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టడంతో ఈ భూబాగోతం భయటపడిందని డీసీపీ తెలిపారు. గండిపేటలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపైన క్రమబద్ధీకరించినట్లు చూపిస్తూ ఐదు నకిలీ జీవోలను తయారు చేసి, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడి యా వేదికల ద్వారా విసృ్తతంగా ప్రచారం చేసినట్లు గుర్తించారు.
గండిపేట గ్రామానికి చెందిన దివంగత దశరథ్ కుటుంబ సభ్యులు నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, మంగా తదితరులు గండిపేటలోని సర్వే నంబర్ 18లో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిపై తమకే హకులు ఉన్నట్లు ప్రచారం చేసుకోవడంతోపాటు ఈ భూమిపై హకుల కోసం రెవెన్యూ శాఖపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం 2025 అక్టోబర్‌లో నిందితులు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా నిందితులు వెనకి తగ్గకుండా భారీ కుట్రకు తెర లేపినట్లు పోలీసులు వెల్లడించారు. బొల్ల రమేష్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడు తదితరులతో కలిసి ఎకరానికి రూ.3.5 కోట్ల చొప్పున ఈ భూమిని విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ భూ వ్యవహారాన్ని చట్టబద్ధమైనదిగా చూపించేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు భూపత్రాలు సృష్టించి, ప్రభుత్వమే భూమిని క్రమబద్ధీకరించి తమకు కేటాయించిందని చూపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో భాగంగా నిందితులు పరస్పరం ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ భూ వ్యవహారాలలో ఇప్పటివరకు సుమారు రూ.4 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా బిల్లా బ్రహ్మనాయుడి ఖాతా నుంచి రెండు విడతల్లో 1.25కోట్ల మేర డబ్బు బదిలీ జరిగినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అయితే సునీల్, రాధాకృష్ణ తదితరులు మధ్యవర్తులుగా వ్యవహరించి అక్రమ భూ లావాదేవీలకు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
కోర్టు అనుమతితో నిందితుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో బ్యాంక్ పాస్ బుక్‌లు, ఒప్పంద పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో కీలక డిజిటల్ ఆధారాలు లభించినట్లు సమాచారం. నకిలీ పత్రాలు సృష్టించిన నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పరారీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మ నాయుడు, బొల్ల రమేష్, సునీల్, రాధాకృష్ణ తదితరులను పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసును డీసీపీ సిహెచ్.శ్రీనివాస్, డీసీపీ (క్రైమ్స్) ఏ.ముత్యంరెడ్డి, డీసీపీ (సైబర్ క్రైమ్స్) సాయి మనోహర్, అదనపు డీసీపీ ఉదయ్‌రెడ్డి పర్యవేక్షణలో నాలుగు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.