హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది. రేషన్ బియ్యం కోసం ఇకపై కార్డును స్కాన్ చేస్తే సరిపోతుందా? వేలిముద్ర వేయకుండా, కార్డు నంబర్ ఎంటర్ చేయకుండానే రేషన్ బియ్యం తీసుకోవచ్చా? ఈ కార్డులో పొందుపరిచిన అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్‌తో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకోవచ్చా? ఒకవేళ కార్డు మర్చిపోతే బియ్యం ఇవ్వరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. స్మార్ట్ కార్డులతో ఇవేవీ కావు. ప్రస్తుతం రేషన్ బియ్యం ఎలా తీసుకొంటున్నారో.. స్మార్ట్ కార్డు వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా తీసుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సర్కార్ చెప్తున్న స్మార్ట్ రేషన్‌కార్డు ప్రచారానికి తప్ప.. పైసా ప్రయోజనం లేదని పౌరసరఫరాల అధికారులు చెప్తున్నారు. దేశంలో ఇప్పుడే తొలిసారిగా రేషన్‌కార్డుల పంపిణీ చేపడుతున్నట్టుగా, రేషన్ బియ్యం ఇప్పుడే తొలిసారిగా పంపిణీ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ హంగూ ఆర్భాటాలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 1.06 కోట్ల స్మార్ట్ రేషన్‌కార్డుల ముద్రణ కోసం ప్రభుత్వం 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. స్మార్ట్ రేషన్‌కార్డులో సీఎం రేవంత్‌రెడ్డి, సివిల్ సప్ల య్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించనున్నారు. వీరి ఫొటోలతో ప్రచారం కోసమే రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో రేషన్‌కార్డుపై ఆ కార్డులో సభ్యులైన కుటుంబసభ్యుల ఫొటోలను ముద్రించి పంపిణీ చేశారు. కానీ, ఇప్పు డు కుటుంబసభ్యుల ఫొటోలు కాకుండా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలను ము ద్రిస్తున్నది. ఈ కార్డు మీద లబ్ధిదారుల ఫొటో లు కానీ, కనీసం వారి పేర్లు కానీ ముద్రించడంలేదు. కుటుంబ పెద్ద పేరు మాత్రమే ము ద్రిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్‌లో ఎప్పుడు ఎవరి పదవి ఊడుతుందో తెలియదు. సీఎంతోపాటు మం త్రుల పదవులు ఢిల్లీలోని అధిష్ఠానం చేతుల్లోనే ఉంటాయి. ‘కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారం ఆకస్మికంగా సీఎంగా రేవంత్రెడ్డినో, మంత్రి ఉత్తమ్నో తప్పిస్తే పరిస్థితేంది? మళ్లీ కొత్త వాళ్ల ఫొటోలతో మరోసారి కొత్త కార్డులను ముద్రిస్తారా? లేదంటే ఒకరు మంత్రిగా ఉంటే మరొకరి ఫొటోలతో పంపిణీ చేస్తారా?’ అనే ప్రశ్న లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై ప్రజలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం మారితే మళ్లీ రేషన్‌కార్డులను ముద్రించాల్సి ఉంటుంది. ఇలా ముం దూవెనుక ఆలోచన లేకుండా ప్రచారమే పరమావధిగా రేషన్‌కార్డులపై ఫొటోలు ముద్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్మార్ట్ రేషన్‌కార్డులో అత్యాధునిక తొమ్మిది సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచినట్టు ప్రభుత్వం చెప్తున్నది. అసలు ఆ కార్డుతో ఎలాంటి ప్రయోజనం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంటే, ఇక సెక్యూరిటీ ఫీచర్లు ఉంటే ఏంది? లేకుంటే ఏంది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చేసే అవకాశం ఉంటుందా? అంటే అదీ లేదు. ఒకవేళ పీవోఎస్ మిషన్‌లో రేషన్‌కార్డు నంబర్ ఎంటర్ చేయకుండా, కేవలం కార్డును స్వైప్ చేస్తే రేషన్ వస్తుందా? అంటే అదీలేదు. ఇప్పటివరకు రేషన్‌కార్డు లేకపోయినా రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఇప్పుడు స్మార్ట్ కార్డు పంపిణీ చేసినప్పటికీ, ఆ కార్డును తీసుకెళ్లపోయినా రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. ఇలా ఒక్కటంటే ఒక్క ప్రయోజనం కూడా లేని కార్డులకు సెక్యూరిటీ ఫీచర్లంటూ ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ సర్కార్కే చెల్లిందనే విమర్శలొస్తున్నాయి.