హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని తార్నాకలోని 65 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా విజయడెయిరీ ఆవరణలోని రెండు క్వార్టర్లను కేటాయించే అంశంపై ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
తార్నాకలోని విజయ డెయిరీ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలకు తగిన భవనం, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కె.త్రిపురతోపాటు మరో ఎనిమిది మంది తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సుద్దాల చలపతిరావు శుక్రవారం విచారించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ, 1961 నుంచి విజయ డెయిరీ ఆవరణలో ఈ పాఠశాల కొనసాగుతోందన్నారు. అప్పట్లో డెయిరీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ప్రస్తుతం తార్నాక పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు చదువుతున్నారని వివరించారు. అయితే పాఠశాల నడుస్తున్న క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థినుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
అదే ఆవరణలోని ఎ-టైప్ క్వార్టర్లలో రెండు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని పాఠశాలకు కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజయ డెయిరీ కార్యకలాపాలు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు తరలిపోయాయని చెప్పారు. తార్నాకలోని భవనాలు, క్వార్టర్లు ఖాళీగా ఉన్నా.. పాఠశాల అవసరాల కోసం రెండు గదులను కేటాయించడం లేదన్నారు. విజయ డెయిరీకి కేటాయించిన 42 ఎకరాల భూమిలో ఐదు ఎకరాలను ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని గత ఏడాది ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రతకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వాదించారు.
వాదనలపై హైకోర్టు స్పందిస్తూ, పిల్లల విద్యా హకు, భద్రత అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న భవనంలో విద్యార్థినులు చదువుకోవడం సురక్షితం కాదని అభిప్రాయపడింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. తల్లిదండ్రులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించి విచారణను వాయిదా వేసింది.