నీట్ పరీక్ష లీక్ అవడం ఈ ఏడాదే మొదటిసారి కాదు. 2021లో, 2024లోనూ లీక్ అయింది. 2024లో ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అసమర్థతపైన చాలా చర్చ జరిగింది. ఎన్టీఏ నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరుగకుండా ఉండేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. నీట్ పరీక్ష నిర్వహణపై అధ్యయనం చేసిన ఈ కమిటీ పరీక్ష సక్రమంగా జరగాలంటే మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రశ్నపత్రాల రవాణా, డిజిటల్ భద్రత, సైబర్ సెక్యూరిటీ, పరీక్ష కేంద్రాల ఎంపిక, డేటా రక్షణ, అభ్యర్థుల ఆధార్ ధృవీకరణ వంటి కమిటీ 10 కీలక విభాగాల్లో సంస్కరణలపై 101 సిఫారసులు చేసింది. నీట్‌ను పెన్ అండ్ పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ పద్ధతిలో నిర్వహించాలని కీలకమైన ప్రతిపాదన చేసింది. కానీ, కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా 2026లో మళ్లీ పేపర్ లీక్ అయింది.
నీట్ పరీక్ష నిర్వహణే కాదు, అసలు ఈ పరీక్ష విధానాన్ని తీసుకురావడమే ఒక రకమైన వివాదం. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నీట్ పరీక్షను సమాఖ్య వ్యవస్థపై దాడిగా మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ ఉన్నది. నీట్ రాకముందు మెడికల్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్ష ఉండేది కాదు. అభ్యర్థులు వేర్వేరు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వచ్చేది. ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాలకు సొంతంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించేవి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, తమిళనాడులో టీఎన్సెట్, కర్ణాటకలో కేసెట్.. ఇలా ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం పరీక్షలు నిర్వహించేవి. ఇక అఖిల భారత కోటా 15% సీట్ల కోసం ఏఐపీఎంటీ (ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్ట్) ఉండేది. అలాగే ఎయిమ్స్, జిప్మర్ వంటి సంస్థలు, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు సొంత ప్రవేశ పరీక్షలను నిర్వహించేవి. ‘ఒకే దేశం-ఒకే ప్రవేశ పరీక్ష’ అనే నినాదంతో కేంద్రం నీట్ పరీక్షను తీసుకువచ్చింది. అయితే, దీనివల్ల విద్యార్థులు 10-15 వేర్వేరు పరీక్షలు రాయాల్సి వస్తున్నదని, ఇన్ని పరీక్షలకు ఫీజులు చెల్లించడం విద్యార్థులకు కష్టంగా ఉండేది. అలాగే వేర్వేరు నగరాల్లో సెంటర్లు పడితే, అక్కడికి వెళ్లి పరీక్ష రాయడం ఇబ్బందికరంగా మారేది. అలాగే ఒక్కో ప్రవేశ పరీక్షకు ఒక్కో సిలబస్ ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడి లోనయ్యేవారు. నీట్ పరీక్ష అంత సులభంగా ఏమీ అమల్లోకి రాలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2010లో జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష ప్రతిపాదన తీసుకువచ్చింది. ఆ తర్వాత మూడేండ్లకు 2013 మే 5న దేశంలో తొలిసారిగా నీట్ పరీక్ష నిర్వహించారు. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల అది రద్దయింది. నీట్‌ను వ్యతిరేకిస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. విచారణ జరిపిన అప్పటి సీజేఐ అల్తమస్ కబీర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2013 జులై 18న 2:1 మెజారిటీతో నీట్‌ను రద్దు చేసింది.
దేశవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు, రాష్ర్టాల రాజ్యాంగ హక్కులపై ఒకే పరీక్షను రుద్దే అధికారం ఎంసీఐకి లేదు అని పేర్కొంది. దీంతో 2014, 2015లలో పాత విధానమే కొనసాగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2015లో కూడా ఈ మెడికల్ ఎంట్రెన్స్ ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్షను మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది.
నీట్‌ను రద్దు చేయాలన్న త్రిసభ్య ధర్మాసనం తీర్పుపై కేంద్ర ప్రభుత్వం, ఎంసీఐ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ.ఆర్.దవే నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2016 ఏప్రిల్ 11న 2013 నాటి తీర్పును రద్దు చేసింది. పాత తీర్పులో సరైన చర్చ జరగలేదని, వైద్య విద్యలో పారదర్శకత ముఖ్యమని పేర్కొంటూ నీట్ విధానాన్ని పునరుద్ధరించింది.
నీట్ వల్ల జాతీయ స్థాయిలో పోటీకి విద్యార్థులకు ఒకే వేదిక ఉంటుందని, మెరిట్ విద్యార్థులకు మేలు జరుగుతుందని భావించారు. కానీ, వాస్తవంలో అలా జరుగలేదు. ఎందుకంటే నీట్ సిలబస్ పూర్తిగా ఎన్సీఈఆర్టీ/సీబీఎస్ఈ ఆధారితంగా ఉంటుంది. పలు రాష్ర్టాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో సిలబస్ వేరు. బోధన కూడా చాలా వరకు ఆయా రాష్ర్టాల స్థానిక భాషల్లో ఉంటుంది. పిల్లలను సీబీఎస్ఈ స్కూళ్లలో చేర్పిద్దామా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకు సరిపడా స్కూళ్లు కూడా లేవు. ఇందువల్ల విద్యార్థులకు నష్టం జరిగింది.
నీట్‌కు ముందు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ప్రైవేట్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేసేవి. ఈ పరిస్థితుల్లో మెరిట్ ఉన్న విద్యార్థులకు నీట్ వల్ల మేలు జరుగుతుందని పలువురు భావించారు. వైద్య విద్యాప్రమాణాలు దేశమంతటా ఒకేలాగా ఉంటాయని ఆశించారు. కానీ నీట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ బోర్డుల్లో చదివిన గ్రామీణ విద్యార్థులు నష్టపోయారు. పేద విద్యార్థుకు నీట్ పరీక్ష చాలా ఇబ్బందిగా మారింది. ప్రత్యేకంగా కోచింగ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి మరింతగా పెరిగింది. ఇది విద్యార్థుల్లో ఒత్తిడి ఎక్కువయింది. కోచింగ్ ఫీజులు చెల్లించగలిగే వాళ్లకు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువగా నీట్లో ర్యాంకులు రాసాగాయి. తమిళనాడు ప్రభుత్వం వేసిన ఏకే రాజన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అందుకే నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్రం మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నది.
రాజ్యాంగంలో ‘విద్య’ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఆరోగ్య రంగం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. నీట్ వల్ల రాష్ర్టాల్లోని మెడికల్ కాలేజీల సీట్ల భర్తీపై కేంద్రానికి (ఎన్టీఏ) పూర్తి ఆధిపత్యం లభించినట్టయింది. ఇది సమాఖ్య విధానానికి విరుద్ధమని పలు రాష్ర్టాలు వాదిస్తున్నాయి. తమ ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలను కేంద్రం చేతుల్లో పెట్టడానికి సమ్మతించబోమని అభ్యంతరం తెలుపుతున్నాయి. వీటన్నింటికి తోడు ఉత్తరాది రాష్ర్టాల్లోని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు నీట్ పరీక్ష విధానంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
నీట్లో ఆలిండియా కోటాలో ర్యాంక్ సాధించి, తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఇక్కడివారితో పోటీ పడలేక పోతున్నారు. చదువులో అంత వెనుకబడి ఉన్నవారు ఆలిండియా కోటాలో ర్యాంకులు ఎలా సాధిస్తున్నారన్న ప్రశ్నలూ వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 4,400 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 5,850 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో స్థానిక విద్యార్థులకు 85%, ఆలిండియా కోటాలో ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 15 శాతం సీట్లు ఉంటాయి. అంటే మన రాష్ట్రంలోని కాలేజీల్లోని 660 సీట్లను ఆలిండియా కోటాలో ఇతర రాష్ర్టాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మరి ఈ మేరకు తెలంగాణ విద్యార్థులు ఆలిండియా కోటాలో వేరే రాష్ర్టాల్లోకి వెళ్తున్నారా..? నీట్ వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం ఉన్నదా? అంటే అంతగా ఏమీ లేదు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను వదిలేసి వేరే రాష్ర్టాల్లోని మెడికల్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఇక ప్రైవేట్‌లోనూ 50 శాతం స్థానిక కోటా ఉంటుంది. వెరసి ఇక్కడి విద్యార్థులు ఇక్కడే చదువుకుంటున్నారు. నీట్ వల్ల మన విద్యార్థులకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు.
నీట్‌పై రాష్ర్టాల అభ్యంతరాలు, లీకేజీల సమస్య, అర్హత లేని ఉత్తరాది విద్యార్థులు కూడా లీకులు, ఇతర బలవంతపు చర్యలతో ఆలిండియా ర్యాంకులు సాధిస్తున్నారన్న అనుమానాలు విమర్శల నేపథ్యంలో, ముఖ్యంగా తాజాగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో సంస్కరణ చర్యలు చేపట్టాలి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అందుకే రాష్ర్టాల్లోని ప్రత్యేక పరిస్థితులను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధానాన్ని కేంద్ర చట్టం ద్వారా పునరుద్ధరించాలి. ఆలిండియా కోటా సీట్లకు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు అన్నింటికీ కలిపి ఒకే ప్రవేశపరీక్ష ఉండేలాగా చర్యలు తీసుకోవచ్చు. జాతీయ ప్రమాణాలు, రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి అనేవి పరస్పర వైరుధ్యాలు కావు. నాణ్యమైన వైద్యవిద్యా, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తి లక్ష్యాలను సమన్వయం చేసే సమతుల్య విధానమే భారతదేశానికి అవసరం.
రాజ్యాంగంలో ‘విద్య’ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఆరోగ్య రంగం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. నీట్ వల్ల రాష్ర్టాల్లోని మెడికల్ కాలేజీల సీట్ల భర్తీపై కేంద్రానికి (ఎన్టీఏ) పూర్తి ఆధిపత్యం లభించినట్టయింది. ఇది సమాఖ్య విధానానికి విరుద్ధమని పలు రాష్ర్టాలు వాదిస్తున్నాయి. తమ ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలను కేంద్రం చేతుల్లో పెట్టడానికి నిరాకరిస్తున్నాయి.