న్యూఢిల్లీ, జూలై 24 : దేశీయ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి రావడానికి వాల్‌మార్ట్‌కు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే వచ్చే నెల రోజుల్లో ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే సాధ్యాసాధ్యాలను పరిశీలించి దేశవ్యాప్తంగా సేవల విస్తరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ఓ ప్రముఖ జాతీయ దినపత్రికకు స్పష్టం చేశారు. ఇదే జరిగితే ఈ రంగంలో ఇప్పటికే ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి ప్రధాన సంస్థలకు ఫ్లిప్‌కార్ట్ నుంచి గట్టి పోటీ ఎదురవగలదన్న అంచనాలున్నాయి. కాగా, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో ఇప్పుడున్న పోటీని తట్టుకొని ఓ కొత్త సంస్థ నిలదొక్కుకొనే వీలుందనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కృష్ణమూర్తి బదులిస్తూ.. సరైన ప్రణాళికతో, బలమైన నెట్వర్క్, శ్రామిక శక్తితో విజయం లభించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు.
ఇక గత ఆర్థిక సంవత్సరం దాదాపు 9 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతీయ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ.. 2029-30నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరవచ్చని జెఫ్రీస్ అంచనా. జొమాటో, స్విగ్గీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలోకి ర్యాపిడో వోన్లీ, ఓఎన్డీసీ ఆధారిత వేదికలూ వచ్చాయి. ఇక తీవ్రమవుతున్న పోటీ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకొనేందుకు 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ స్విగ్గీ బోల్ట్, బ్లింకిట్ బిస్ట్రో, జెప్టో కేఫ్‌ల వంటి సర్వీసులెన్నో పరిచయమయ్యాయి. మొత్తానికి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ ఆలోచనలు ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో మిక్కిలి ప్రాధాన్యతాంశంగా నిలుస్తున్నాయి.