పాలకుర్తి, జూలై 24 : కరెంట్ కోతలతో అన్నదాతలు పరేషాన్ అవుతున్నారు. అడ్డగోలుగా విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తుండడంతో వరి పొలాలు ఎండుతుండడంతో తల్లడిల్లుతున్నారు. 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని ఆర్భాటంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి కనీ సం ఇటు వైపు చూసిన దాఖలాలు లేవు. ఎడాపెడా విద్యుత్ కోతలతో నాటేసిన వరి పొలాలు ఎండుతున్నాయి. నారు మడులకు నీళ్లు అందక దున్నకాలు సాగడం లేదు.
పాలకుర్తి మండలం లోని దర్దేపల్లితో పాటు కొండాపురం, గూడోళ్లగూడెం, టీఎస్కే తండా, దుబ్బతండా, కంబాల కుంట తండా మల్లంపల్లి గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయంతో పాటు గృహ అవసరాల కోసం కూడా కరెంట్ కోతలు విధిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడ్డా, గాలి దుమారానికి సైతం కరెంట్ తీసేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కరెంట్ కోతలతో మోటర్లు సైతం కాలుతున్నాయని, వెంటనే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిం చాలని రైతులు కోరుతున్నారు.
కరెంట్ కోతలతో పొలం ఎండుతుంది. నేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. నాటు వేసి నాలుగు రోజులైంది. నీళ్లు అందక ఎండుపోతున్నది. సరిగా విద్యుత్ రాకపోవడంతో మోట ర్లు సైతం కాలుతున్నాయి. కొండాపురం సబ్ స్టేషన్ కింద కరెంట్ ఎప్పుడూ ఉండడం లేదు. అడిగితే ఏదో మరమ్మతు అని చెబుతారు. గంటగంటకూ కరెంట్ తీస్తున్నారు. పొలాలు సరిగా పారడం లేదు. మోటర్లు పోయక దున్నకాలు సాగడం లేదు. కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకొని కరెంట్ ఇచ్చి పంటలు కాపాడాలి.
– జలగం అంజయ్య, రైతు, దర్దేపల్లి