ముంబై, జూలై 24 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మొత్తం నష్టాలకే పరిమితమయ్యాయి. చివరి రోజైన శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 331.62 పాయింట్లు లేదా 0.43 శాతం పడిపోయింది. ఒకానొక దశలోనైతే 916.96 పాయింట్లు దిగజారింది. అయితే తిరిగి కోలుకొని 76,059.77 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 102.15 పాయింట్లు లేదా 0.43 శాతం పతనమై 23,767.45 వద్ద నిలిచింది. దీంతో గత 5 రోజుల్లో సెన్సెక్స్ 2,091.68 పాయింట్లు, నిఫ్టీ 566.85 పాయింట్లు క్షీణించినైట్టెంది. కాగా, అమెరికా వాణిజ్య సుంకాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మదుపర్లను పెట్టుబడుల ఉపసంహరణల దిశగా నడిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న ముడి చమురు ధరలు.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.
ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు నిరాశపర్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపర్లను మెప్పించలేదు. దీంతో కంపెనీ షేర్ విలువ 1 శాతం నష్టపోయింది. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.46 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.08 శాతం చొప్పున పెరుగడం విశేషం. ఇక రంగాలవారీగా.. ఆటో, టెలికాం, విద్యుత్తు, చమురు-గ్యాస్, రియల్టీ, మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి.