న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్’లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని 2 వేల మందికి పైగా పౌరులు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు ఇటీవల లేఖ రాశారు. ‘సర్’ విషయంలో న్యాయ వ్యవస్థ వెంటనే జోక్యం చేసుకోవాలని, సుమోటోగా స్వీకరించాలని కోరారు. సర్‌పై వెంటనే స్టే విధించి దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై మాజీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్, ఆర్థికవేత్తలు జయతీ ఘోష్, కమల్ మల్హోత్రా, రిటైర్డ్ ప్రొఫెసర్లు ఆదిత్య, మృదుల ముఖర్జీ, ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు సంతకాలు చేశారు.
విద్యావేత్తలు, న్యాయవాదులు, మాజీ సివిల్ సర్వెంట్లు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, రిటైర్డ్ సైనిక ఉద్యోగులు సీజేఐకు ఈ బహిరంగ లేఖ రాస్తూ.. ఈసీ పనితీరుపై, దాని కేంద్రీకృత ఈసీఐనెట్ టెక్నాలజీపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలన్నారు. స్థానిక ఎన్నికల అధికారులను కాదని ఈ టెక్నాలజీ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఈ విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఇతర అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల మధ్య అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉండటంపై లేఖ రాసిన పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫామ్-6 మార్పులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాలు, సాఫ్ట్వేర్ లాక్ లేదా విధానపరమైన మార్పుల వల్ల తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.