హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆ సెక్షన్లోకి ఒక ఫైల్ వెళ్లిందంటే చాలు.. అది కమిషనర్ వరకు వెళ్లి.. తిరిగి ఆ ఉత్తర్వుల కాపీ వచ్చే వరకు జరిగే తతంగమంతా ఆ సెక్షన్ సిబ్బంది చేతుల్లోనే ఉంటుంది. సెలవులు మొదలు ప్రమోషన్ల వరకు పెద్ద దేవాలయాలకు సంబంధించి ఉద్యోగపరమైన రకరకాల అంశాలు ఆ సెక్షన్ చేతిలోనే ఉంటాయి. కమిషనర్‌ను కలిసినా, ఆ సెక్షన్ ఉద్యోగి కరుణించనిదే సంబంధిత ఫైల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు.
ఇందుకోసం ఆ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాలి. వారు అడిగింది ముట్టజెప్పాలి. తెలంగాణ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోని బీ సెక్షన్లో జరుగుతున్న అక్రమాల బాగోతమిది. రాష్ట్రంలోని వేములవాడ, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం, జోగుళాంబ వంటి దేవాలయాలకు సంబంధించి ఏ ఫైల్ అయినా బీ సెక్షన్‌కు వెళ్లాల్సిందే. ఆ సెక్షన్లో ప్రతిరోజూ లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు! ఆ ప్రకారం ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు పోతుంది. ఈ వ్యవహారం కమిషనర్‌కు తెలిసినా, ఆయన ఎన్నిసార్లు మందలించినా అక్రమార్కుల్లో మాత్రం మార్పు రావడం లేదని దేవాదాయ అర్చక ఉద్యోగులు చెప్తున్నారు.
కీలక అధికారికి వాటాలు!
అతను బీ సెక్షన్లో ఒక ఉద్యోగి. ప్రతినెలా అతని బ్యాంకు ఖాతాకు వేల రూపాయల ముడుపులు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ లావాదేవీలను అతను నేరుగా చేయకుండా, తన దగ్గర ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా, తాను నివసించే బహదూర్‌పురా ప్రాంతంలోని తన మిత్రుల నంబర్ల ద్వారా చేస్తున్నాడని ఆ సెక్షన్ ఉద్యోగులు చెప్పుకొంటున్నారు. ఈ విషయంలో అతనిపై ఎన్నిసార్లు, ఎంతమంది కమిషనర్లకు ఫిర్యాదులు చేసినా తన సామాజికవర్గ ముఖ్య ఉద్యోగులతో పైరవీలు చేయించుకుంటూ, వారికి తన ఆదాయంలో వాటాలు ఇస్తూ మొత్తం మేనేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఈ ఒక్క ఉద్యోగికే పరిమితం కాలేదు.
దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోని కొన్ని సెక్షన్లలో కొందరు ఉద్యోగులు చేస్తున్న అరాచకాలతో తాము విసిగిపోతున్నామని దేవాలయాల అర్చక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా వైరల్ అయ్యాయి. తమ యూపీఐ లావాదేవీలకు సంబంధించి అధికారిక ఖాతాల్లోకే వేర్వేరు అకౌంట్ల ద్వారా డబ్బులు పంపించుకొంటున్నారని, కొందరేమో తమ కార్యాలయ ఆవరణలోకి వచ్చిన వారిని అక్కడి నుంచి వెనుక వైపునకు రమ్మని చెప్పి, కార్యాలయం పక్క సందులో ఉన్న హోటల్ వద్దకు కానీ, ఎదురుగా ఉన్న జిరాక్స్ సెంటర్‌కు కానీ పిలిచి అక్కడ తీసుకొంటున్నారని చెప్పారు. ఈ విషయంలో ఒక కీలక అధికారి కూడా ఈ అక్రమార్కులకు సహకరిస్తూ తన వాటా తాను తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు!
ఇది ఒక్క సెక్షన్‌కే పరిమితం కాలేదు.. ఆ శాఖలో గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు ప్రతిచోటా ఇదే దందా నడుస్తున్నదని, ముఖ్యమైన విభాగాలు చూసే కొందరు ఉద్యోగుల కారణంగా మొత్తం శాఖకే చెడ్డ పేరు వస్తున్నదని ప్రధాన కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రతి దేవాలయానికీ సరుకులు సరఫరా చేసే ఒక కాంట్రాక్టర్ సామాజికవర్గానికి చెందిన ఓ ముగ్గురు ఉద్యోగులైతే సిండికేట్‌గా మారి ఏకంగా శాఖలో కమిషనర్ పేషీ వరకు మొత్తం వ్యవహారం నడుపుతున్నారని దేవాదాయ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొందరు అధికారులైతే తమ పరిధిలోని ఆలయాల నుంచే ఉదయం టిఫిన్ మొదలుకొని రాత్రి భోజనం వరకు ఇంటికే తెప్పించుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. ఇటీవల గ్యాస్ కొరత కారణంగా ఈ భోజనాలు, అన్నదానాలు కొంతకాలం ఆగిపోయినా మళ్లీ వ్యవహారం మొదలైనట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన అధికారుల వ్యవహారంతోపాటు పలువురు ఉద్యోగుల అవినీతిపై ఆధారాలు సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. తమకు ఉన్న పరిచయాలు, ఎంతోకాలంగా తాము అదే సీటులో ఉంటూ అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు, ప్రత్యేకించి ఆ శాఖ ప్రధాన అధికారులు, అదనపు అధికారులను మంచి చేసుకొనే క్రమంలో చేసే ఆర్జితసేవలు అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. గతంలో మంత్రి ప్రవేశపెట్టిన ఈ-ఆఫీసు ముచ్చటైతే ఎప్పుడో అటకెక్కింది.
ఈ-ఆఫీసు అంటే అదెక్కడ అనే పరిస్థితి ప్రస్తుతం బొగ్గులకుంట కార్యాలయంలో కనిపిస్తున్నది. ఇదిలాఉంటే, ఉద్యోగులకు ఆ శాఖ పరంగా వర్తించాల్సిన కొన్ని పథకాల దరఖాస్తుల విషయంలో ఆ ఉద్యోగుల పంట పండినట్లేనట. ఎవరైనా ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే ఫైల్ పెట్టింది మొదలు పూర్తయ్యే వరకు అడుగడుగునా డబ్బులు సమర్పించుకోవసిందేనని ఉద్యోగులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆ ముగ్గురు ఉద్యోగులపై సోషల్‌మీడియాలో వైరల్ అయినా, వారు తమ డబ్బులతో జల్సాలు చేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వారి తీరు మారలేదు సరికదా ఎట్లాగూ తమ వ్యవహారం బయటపడింది కదా. ఇక దాపరికం ఎందుకన్న రీతిలో ముడుపుల దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
అడుగడుగునా వసూళ్లే..!
దేవాదాయ శాఖ కమిషనర్ ఉండే ప్రధాన కార్యాలయంలో ప్రతి సెక్షన్లో అవినీతి రాజ్యమేలుతున్నదని కొందరు అధికారులే చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగుల ఫైళ్లు కదలాలన్నా, ఆ శాఖకు సంబంధించిన దేవాలయాల పనులకు సంబంధించిన ఫైళ్లను చూడాలన్నా ఒక్కో టేబుల్‌కు ఒక్కో ధర నిర్ణయించారని ఆ శాఖలో పనిచేస్తున్నవారే చెప్పుకొంటున్నారు.
ఎనిమిది నెలల క్రితం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్‌ను కమిషనర్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్న సమయంలోనూ ప్రధాన దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలు చూసే బీ సెక్షన్లో ఉద్యోగి ఒకరు ఒక ప్రధాన దేవాలయానికి సంబంధించి ఒక ఫైల్ కదలాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏసీబీ దాడుల కలకలంతో బయటకు వెళ్లి వెనుక వైపు ఉన్న హోటల్ దగ్గర ఆ డబ్బులు తీసుకున్నారని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత కూడా ప్రతిరోజూ ఆ ఉద్యోగి కనీసం రూ.యాభైవేలు లేనిదే ఆఫీసు నుంచి బయటకు వెళ్లరని, తనకు రావలసిన డబ్బులను వివిధ రూపాల్లో తీసుకొని తనకు అనుకూలమైన రెండు చోట్లా పెట్టి సాయంత్రం వెళ్లే సమయంలో తీసుకెళ్తారని ఉద్యోగులు చెప్తున్నారు. ఇది ఒక్క సెక్షన్‌కు సంబంధించి సీనియర్ ఉద్యోగి దందా కాగా, కమిషనర్ పేషీ వరకు కొందరు ఉద్యోగులు ఆలయాల వారీగా, అంశాల వారీగా సెక్షన్లలో కీలక ఉద్యోగుల ద్వారా ముడుపుల్లో వాటాలు తీసుకొంటున్నారని సమాచారం. కార్యాలయం వెనుక ఉన్న ఓ ప్రాంతంలో తాము నిర్ణయించిన ధర మేరకు డబ్బులు చెల్లించాలని, లేకుంటే కమిషనర్ పేషీ వరకు ఫైల్ చేరడం, తిరిగి సదరు ఉద్యోగికి రావడం చాలా కష్టమని దేవాదాయ సిబ్బందే చెప్పుకుంటున్నారు.