నకిరేకల్, సెప్టెంబర్ 27: కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన తమ పార్టీ నాయకుడిని అక్రమంగా పోలీస్‌స్టేషన్‌లో 12గంటలకు పైగా ఎలా నిర్బంధిస్తారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మర్రూర్ గ్రామశాఖ అధ్యక్షుడు మహమూద్ అలీని పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించిన విషయం తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య ఆదివారం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అలీని పరామర్శించి పోలీసులపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మర్రూర్ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో బీఆర్ఎస్ పార్టీని, పార్టీ నేతలను అనుచిత వ్యాఖ్యలతో నిందిస్తున్న క్రమంలో ఖండిస్తూ మహమూద్ అలీ అదే గ్రూప్‌లో మెసేజ్ చేశారని, దీంతో శనివారం రాత్రి అలీపై అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ గూండాలు మద్యం మత్తులో రాళ్లతో దాడిచేశారని తీవ్రంగా గాయపర్చారని ఆరోపించారు. దాడి చేసిన వారే అలీపై ఫిర్యాదు చేశారని, బాధ్యులపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన అలీ నుంచి ఫిర్యాదు తీసుకోకుండా, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అలీని అక్రమంగా స్టేషన్లోనే నిర్బంధించారని మండిపడ్డారు. గాయపడిన వ్యక్తికి పోలీసులు కనీసం దవాఖానలో చికిత్స కూడా అందించలేదని తెలిపారు. తమ కార్యకర్తపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయని పక్షంలో నల్లగొండలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.