న్యూఢిల్లీ: ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చెల్లుబాటు అయినప్పటికీ.. 18 ఏండ్లలోపు బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు పోక్సో చట్టం కింద నేరం నుంచి మినహాయింపు లభించదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికతో వివాహాన్ని కారణంగా చూపి, పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి తప్పించుకునే అవకాశం కల్పిస్తే, ఆ చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ సంజీవ్ నరులా ఇచ్చిన ఉత్తర్వులో ఈ వ్యాఖ్యలు చేశారు.
మైనర్ అయిన తన భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణతో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కేసు ప్రకారం బాలికకు 16 ఏండ్ల మూడు నెలలు. ఆమె భర్తకు 28 ఏండ్లు. గర్భధారణ సమయంలో ఆమె వయసు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.