హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): ఓ యువకుడు తనపై లైంగికదాడి చేశాడని, పైగా తన నగ్న ఫొటోలను తన అన్న ఫోన్‌కు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించి, ఆ కుటుంబానికి అండగా మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన పోలీసులు.. సూటిపోటి ప్రశ్నలతో వేధించడమేకాకుండా ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటే తమ పరిధి లోకి రాదంటూ చేతులెత్తేశారు. బాధిత కుటుంబం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. వాస్తవానికి బాధితులు ఎవరైనా సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే ప్రాంతం, పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సంబంధిత ఠాణాకు ఆ కేసును బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఉదంతంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసుల అవమానకర ప్రవర్తనతో విసిగిపోయిన బాధితులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్తామని అనడంతో చివరికి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైబరాబాద్ కమిషనరేట్‌కు పంపించారు. అంతటితో ఆగిపోలేదు. డీజిల్‌కు డబ్బులు కావాలంటూ బాధితుల నుంచి రూ.1500 వసూలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఘటన మల్కాజిగిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగింది. ఓ మహిళా ఐపీఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్న ప్రాంతంలోనే బాధితురాలికి భరోసా దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అన్న ఫోన్‌కు చెల్లి నగ్న ఫోటో
జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఓ అన్నకు గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్‌లో ఫొటో పంపించాడు. పరిశీలించగా అది తన చెల్లిదని గుర్తించారు. తనకు రూ. 50 వేలు ఇవ్వాలంటూ ఆ గుర్తుతెలియని వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో షాక్‌కు గురైన ఆ అన్న తన తమ్ముడికి విషయాన్ని వివరించారు. ఏం జరిగిందంటూ వారు చెల్లిని ప్రశ్నించారు. తాను బీఫార్మసీ చదువుతున్న సమయంలో క్లాస్‌మేట్‌తో స్నేహంగా ఉన్నానని, కొన్నాళ్ల తర్వాత అతడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. భయపడి ఎవరికీ విషయం చెప్పలేదని, అప్పటి నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపింది. మళ్లీ కొంతకాలంగా తన క్లాస్మేట్ వేధించడం మొదలుపెట్టాడని, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతం నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని భావించిన బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఆ ఠాణాకు వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు మాత్రం.. లైంగికదాడి జరిగింది మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనని, అక్కడికి వెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు. అయితే బ్లాక్‌మెయిలర్ నగ్న ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, కనీసం ఈ కోణంలో అయినా ఫిర్యాదునైనా తీసుకోవాలని కోరగా ‘మీరు ఉంటున్న ప్రాంతం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడికి వెళ్లండి’ అంటూ పంపించారని పేర్కొన్నారు.
జవహర్‌నగర్‌లో డీజిల్ ఖర్చులకు డబ్బులు
బాధితులు జహర్నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పగా, వారు కూడా తమ పరిధిలోకి రాదని, మేడ్చల్ వెళ్లాలంటూ సూచించారు. ‘నేరెడ్మెట్ స్టేషన్‌కు వెళ్తే మీ దగ్గరకి పంపించారు. మీరు ఇంకో దగ్గరికి పొమ్మంటున్నారు. కానీ మా ఇల్లు జవహర్‌నగర్ ఠాణా పరిధిలోకి వస్తుందని మీ పోలీసులే చెప్పారు’ అంటూ బాధితులు జవహర్‌నగర్ పోలీసులకు మొరపెట్టుకున్నారు. దీంతో ‘మీరు మాకు పరిధి గురించి చెప్తారా?’ అంటూ అక్కడున్న సిబ్బంది కోపగించుకున్నారు. ఆందోళనలో ఉన్న తమను ఓదార్చాల్సింది పోయి, దురుసుగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు. ముందుగా ఆ బ్లాక్‌మెయిలర్‌ను పట్టుకోవాలని, వాడు ఫోటోలను ఇతరులకు పంపిస్తే తమ కుటుంబం ఆగమవుతుందంటూ బాధిత కుటుంబం పోలీసులను వేడుకున్నారు.
అయినా పోలీసుల నుంచి స్పందనలేకపోవడంతో.. విషయం ఉన్నతాధికారులకు చెప్తామంటూ బాధితులు చివరికి గట్టిగా మాట్లాడారు. పరిస్థితి చెయ్యిదాటి పోతుందని భావించిన జవహర్‌నగర్ పోలీసులు ఫిర్యాదు తీసుకొని, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని పట్టుకొస్తామని, అయితే డీజిల్ ఖర్చులకు రూ.1500 ఇవ్వాలంటూ డిమాండ్ చేసి, వసూలు చేశారని బాధితులు తెలిపారు. పోలీసుల ప్రవర్తనతో విసిగిపోయిన తాము గట్టిగా మాట్లాడడంతో, ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందోనని భావించిన ఓ కానిస్టేబుల్ రూ.1,500 తిరిగి ఇచ్చేశాడని బాధితులు పేర్కొన్నారు. ఆ తర్వాత ‘మేం ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. మీరు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లండి’ అంటూ జవహర్‌నగర్ పోలీసులు సూచించారట.
మేడ్చల్ పోలీసుల వ్యంగ్య వ్యాఖ్యలు
తాము ఫిర్యాదు చేసేందుకు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అవమానకరమైన మాటలు, సూటిపోటి ప్రశ్నలు ఎదురయ్యాయని బాధితురాలి కుటుంబసభ్యులు చెప్తున్నారు. ‘వాళ్లిద్దరూ మేజర్లు, అప్పట్లో కలిసి తిరిగారు, ఇప్పుడొచ్చి లైంగికదాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎలా?’ అంటూ ఓ అధికారి వ్యంగ్యంగా, బాధ్యతారహితంగా మాట్లాడాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మధ్యలో వారు జోక్యం చేసుకొని మాట్లాడటంతో పోలీసులు ఏకంగా బాధితురాలి తండ్రిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తీవ్రమైన పదజాలంతో, బెదిరింపు ధోరణితో మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. చివరికి మేడ్చల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఉదంతానికి సంబంధించి కమిషనర్ వివరణ తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ఫోన్లో ప్రయత్నించగా, ఆమె అందుబాటులోకి రాలేదు.