చరిత్రలో నిక్షిప్తమైన పెనువిషాదాలు
పారిన రక్తపుటేరులు
గుణపాఠం నేర్వని దేశాధినేతల మస్తిష్కాలు
జాతి నీతి రీతులన్నీ పతనమైన కిరాతకాలు
మందబుద్ధులు రాజేసిన మానవ హననం
వికసించని మతోన్మాదం ఒకవైపు
వెర్రి తలలు వేస్తున్న జాత్యహంకారం ఇంకొకవైపు
అర్ధంతరంగా చిదిమేసిన బతుకులు
పసిపాపల నిదుర కన్నుల్లో రక్తపు చెలిమెలు
చెరిగిన సరిహద్దుల నియంత్రణలు
చెలరేగిన ఆటవిక ఆక్రమణ దారుణాలు
ఈ ప్రపంచమెంత హింసోన్మాద పూరితం
ఈ దుష్ట ప్రపంచంలో ఎందుకీ నరకయాతన
ఇంకెన్ని యుద్ధాలు చరిత్రలో..
ఎన్నెన్ని మానవ కంకాళాలు కాలగర్భంలో ..
ప్రపంచ యుద్ధాల్లో హతులైన లక్షల ప్రాణికోటి
నిలువెత్తు సాక్ష్యాలుగా
మనుషుల్ని వెక్కిరిస్తున్న నాగసాకి-హిరోషిమా
నరహంతక దురంతం
హంతకముఠాల పాలైన ఘన విజ్ఞాన శోధనలు
ఆయుధాగారాలైన జ్ఞాన కిరణాలు
ఉన్మాదంలో మరుగునపడ్డ మానవత
ఇరాక్-లిబియా-వెనెజువెలా-పాలస్తీనా-అఫ్ఘనిస్థాన్
ఎన్నెన్ని పరాభవాల పాలైనా
గుణపాఠం నేర్వని అగ్రరాజ్యం
సమస్త వనరుల్ని దోచే నికృష్ట నీచత్వం
భూగ్రహాన్నే కబళించే సామ్రాజ్యవాదం
మంటగలిసిన జాతీయతా సార్వభౌమాధికారం
ఈ ధరాతలమే అసురుల చేతిలో ఒక అగ్నిగుండం
ఏ వేదం-ఏ ప్రబోధం-ఏ ప్రవచనం
గీతా-ఖురాన్-బైబిల్ మానవీయతావాదం మేల్కొల్పాలో?
మానవ ప్రజ్ఞలో ఎగిరే శాంతి కపోతం
పాడాలి యుద్ధాలకో చరమగీతం