Lok Sabha : లోక్‌సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం సాయంత్రం జరిగిన మూజువాణి ఓటింగ్‌తో అవిశ్వాసం వీగిపోయింది. ఓటింగ్ అనంతరం సభను గురువారానికి వాయిదావేశారు. స్పీకర్ ఓంబిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గత నెలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
దీనిపై మంగళవారం, బుధవారం చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి కావాల్సిన సభ్యుల సంఖ్యా బలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. ‘సభలో ప్రతిపక్ష నేత మాట్లాడటాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు. స్పీకరా.. కాదు. మీరే నిర్ణయించుకోవాలి. కానీ, మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు జర్మనీ, ఇంగ్లండ్‌లలో ఉంటారు. 16వ లోక్‌సభలో రాహుల్ గాంధీ హాజరుశాతం 52. సగటున 80 శాతం. 17వ లోక్‌సభలో ఆయన హాజరు శాతం 51. సగటున 66 శాతం. 18వ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు మొత్తం 157.55 గంటలు మాట్లాడారు. అందులో రాహుల్ గాంధీ ఎన్నిగంటలు మాట్లాడారు.
ఆయనను ఎవరు ఆపారు..? లోక్‌సభను తక్కువ చేసేందుకు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. రాహుల్ చర్యలు సరైనవి కావు. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి మార్గనిర్దేశకత్వం చేయండి. శశి థరూర్ వంటి వారు ఆయనకు సలహాలివ్వాలి. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం మామూలు విషయం కాదు. ఇది సరైంది కాదు. స్పీకర్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదు. సభను నిష్పాక్షికంగా నడిపే వ్యక్తి’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.