ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్ 2న జరుగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఆకస్మికంగా వాయిదా వేసింది. (TISS postpones convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ముఖ్య అతిథిగా, బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే గౌరవ అతిథిగా హాజరు కావాల్సి ఉన్నది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగించవచ్చన్న భయంతో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని టిస్ ఆకస్మికంగా వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.
కాగా, స్నాతకోత్సవానికి కేవలం రెండు రోజుల ముందు టిస్ ఈ నిర్ణయం తీసుకున్నది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టభద్రులైన విద్యార్థులకు ఈమెయిల్ పంపింది. ‘ఊహించని పరిస్థితుల’ కారణంగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేసినట్లు ఆ సంస్థ రిజిస్ట్రార్ అందులో పేర్కొన్నారు. క్యాంపస్లో భద్రతాపరమైన ఆందోళనలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని విద్యార్థులు నిరసనలు చేపట్టే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వివరించారు.
మరోవైపు ఇప్పటికే విమాన, రైలు ప్రయాణాలు, హోటల్స్ బుకింగ్లు చేసుకున్న వందలాది మంది పట్టభద్రుల విద్యార్థులు, వారి కుటుంబాలను ఈ నిర్ణయం తీవ్ర నిరాశ పరిచింది. అయితే చివరి నిమిషంలో కార్యక్రమం రద్దు వల్ల ఆర్థిక పరిహారం కోసం వచ్చే అభ్యర్థనలను పరిశీలిస్తామని టిస్ తెలిపింది. అలాగే స్నాతకోత్సవం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అవసరమైన తాత్కాలిక ధృవపత్రాలను వెంటనే అందజేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చింది.