భోపాల్: ప్రభుత్వ స్కూల్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు పాఠాలపై దృష్టిసారించడం లేదు. క్లాస్ రూమ్లో ఎంచక్కా తన మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అలాగే ఆ టీచర్ తమ ఇన్స్టాగ్రామ్ ఐడీలు అడుగుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. (Bhind Teacher Controversy) మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోట్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్కూల్ వేళల్లో తరగతులు నిర్వహించకుండా మొబైల్ గేమ్స్ ఆడుతున్నట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. విద్యార్థినుల ఇన్స్టాగ్రామ్ ఐడీలను ఆ టీచర్ అడుగుతున్నట్లు బాలికలు ఫిర్యాదు చేశారు. ‘ఆ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పడానికి స్కూల్కు వస్తున్నారా? లేక అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ ఐడీలు అడగడానికి వస్తున్నారా?’ అని విద్యార్థినులు ప్రశ్నించారు.
కాగా, విద్యార్థుల ఫిర్యాదులు విద్యా శాఖ అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై అధికారిక విచారణ జరుపుతారా? ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇంకా తెలియలేదు.