పెన్‌పహాడ్, సెప్టెంబర్ 30 : పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం సీఐ రాజశేఖర్‌తో కలిసి డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నమోదులు, పెండింగ్ కేసుల వివరాలు, సిబ్బంది హాజరు నమోదు పత్రాలు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత పరిశిలించి, ప్రజలకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల స్వీకరణ విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళల ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఐ బాలు నాయక్, ఏఎస్ రాములు, సిబ్బందిని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై, గంజాయి నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట కారణాలు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు.